-

Amazon WFO: ఉద్యోగులకు అమెజాన్‌ కీలక ఆదేశాలు!

19 Feb, 2023 16:29 IST|Sakshi

ఉద్యోగులకు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలంటూ అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ కోరారు. ఆఫీస్‌లో పనిచేయడం వల్ల సంస్థ లాభపడుతుందని అన్నారు. అంతేకాదు వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌తో పొందే ప్రయోజనాల్ని తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులు కనీసం వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని.. తద్వారా పుగెట్ సౌండ్, వర్జీనియా, నాష్‌విల్లే పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక వ్యాపారాల వృద్దికి ఈ మార్పు ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

కోవిడ్‌ విజృంభించిన సమయంలో అన్ని సంస్థలు ఆన్‌లైన్‌ బాట పట్టాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అంటూ ఉద్యోగులకు కొత్త పని విధానాన్ని అమలు చేశాయి. అయితే ఇప్పుడు మహమ్మారి నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో సంస్థలు ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేసే విధానానికి స్వస్తి పలికాయి. బదులుగా కార్యాలయాల నుండి పని చేయమని ఉద్యోగుల్ని అడుగుతున్నాయి. అమెజాన్ కూడా అదే చేస్తోంది. ఆఫీస్‌కు రావాలని కోరుతూ తన బ్లాగ్‌ పోస్ట్‌లో ఉద్యోగుల్ని కోరింది. 

‘మహమ్మారితో కొత్త వర్క్‌ కల్చర్‌లో ఉద్యోగులు పనిచేసే అవకాశం కల‍్పించాం. కొన్ని బృందాలు ఇంటి వద్ద నుంచి పనిచేయగా.. మరికొంత మంది ఉద్యోగులు ఆఫీస్‌లోనే పూర్తి సమయాన్ని కేటాయించారు. పరిస్థితులు ఇప్పుడు చక్కబడ్డాయి. కాబట్టి ఉద్యోగులు వీలైనంత త‍్వరగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలి. ఆఫీస్ నుండి చేసే పనిని మరింత సమర్ధవంతం చేయగలుగుతాం. ఎందుకంటే మెరుగ్గా రాణించేందుకు ఒకరి నుంచి ఒకరు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. 

ఈ నేపథ్యంలో గత వారం జరిగిన సమావేశంలో ఉద్యోగులు కనీసం వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వచ్చేలా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈవో ఆండీ జాస్సీ తన బ్లాగ్ పోస్ట్‌లో వ్రాశారు.కాగా, ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ గ‌త నెల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మరిన్ని వార్తలు