షాకింగ్‌! అమెజాన్‌ అడ్డాగా మాదక ద్రవ్యాల సరఫరా.. మొదలైన విచారణ

16 Nov, 2021 10:09 IST|Sakshi

మాదక ద్రవ్యాల కేసుపై అమెజాన్‌ అంతర్గత విచారణ

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల విక్రయ లావాదేవీలకు తమ ప్లాట్‌ఫాం వేదికగా మారిందన్న ఆరోపణలపై ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా అంతర్గతంగా విచారణ చేపట్టింది. కేసు సత్వరం పరిష్కారమయ్యేలా అటు దర్యాప్తు సంస్థలకు కూడా పూర్తి సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

మధ్యప్రదేశ్‌లో
మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ పోలీసులు ఆన్‌లైన్‌ మారిజువానా విక్రయ రాకెట్‌ను ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు 20 కిలోల మారిజువానాను స్వాధీనం చేసుకున్నారు. ఈ–కామర్స్‌ సంస్థ ద్వారా నిందితులు ఈ రాకెట్‌ నిర్వహించారని, వచ్చిన లాభాల్లో సంస్థకు మూడింట రెండొంతుల లాభాలు అందినట్టు తెలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల లావాదేవీలకు వేదికగా నిల్చినందుకు గాను సదరు ఈ–కామర్స్‌ సంస్థపై కూడా చర్యలు తీసుకునే దిశగా ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు.

ఎన్‌సీబీ ఎంక్వైరీకి డిమాండ్‌
ఈ కామర్స్‌ వేదికగా నిషేధిత మాదక ద్రవ్యాలు సరఫరా కావడమనేది  తీవ్ర నేరమని, మధ్యప్రదేశ్‌ పోలీసులతో పాటు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ జరపాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ కేంద్రాన్ని కోరింది. అమెజాన్‌ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ను కూడా అరెస్ట్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది.
 

మరిన్ని వార్తలు