అమెజాన్‌ ఏమాత్రం సహాయం చేయలేదు..

5 Jan, 2021 06:18 IST|Sakshi

లాక్‌డౌన్‌ కష్టాలపై ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటాల విక్రయ వివాదానికి సంబంధించి ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా వాటాదారైన అమెజాన్‌పై ఫ్యూచర్‌ మరిన్ని ఆరోపణలు గుప్పించింది. కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ అమలైన సమయంలో తాము తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ .. అమెజాన్‌ పైపై మాటలు చెప్పడం తప్ప ఏమాత్రం సహాయం అందించలేదని ఆరోపించింది. మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో అమెజాన్‌ వ్యవహరించిన తీరు ఏమాత్రం సమంజసమైనదిగా లేదని పేర్కొంది. ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రమోటర్లు.. డిసెంబర్‌ 31న ఈ మేరకు అమెజాన్‌కు లేఖ రాశారు. వాటాల విక్రయం కోసం రిలయన్స్‌తో తాము చర్చలు జరుపుతున్నామని తెలిసినప్పటికీ అమెజాన్‌ నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ తీసుకురాకుండా.. ఆ తర్వాత మోకాలడ్డే ప్రయత్నం చేయడం సరికాదని ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆక్షేపించింది.

తోసిపుచ్చిన అమెజాన్‌: మరోవైపు, ఫ్యూచర్‌ ఆరోపణలను అమెజాన్‌ తోసిపుచ్చింది. ఫ్యూచర్‌ రిటైల్‌కు తాము సహాయం చేసేందుకు ప్రయత్నించలేదన్న ఆరోపణలు సరికాదని వ్యాఖ్యానించింది. ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఎఫ్‌సీపీఎల్‌కు లిస్టెడ్‌ సంస్థ ఫ్యూచర్‌ రిటైల్‌లో (ఎఫ్‌ఆర్‌ఎల్‌) వాటాలు ఉన్నాయి. గతేడాది ఎఫ్‌సీపీఎల్‌లో వాటాలు కొనుగోలు చేయడం వల్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్‌కు స్వల్ప వాటాలు దఖలు పడ్డాయి.

మరిన్ని వార్తలు