వివాదంలో రిలయన్స్‌ - ఫ్యూచర్స్ డీల్ 

9 Oct, 2020 08:09 IST|Sakshi

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు అమెజాన్‌ నోటీసులు

సామరస్య పరిష్కారానికి ఫ్యూచర్‌ మొగ్గు

సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఫ్యూచర్‌ గ్రూప్‌ అసెట్ల విక్రయ అంశం వివాదానికి దారి తీసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఈ డీల్‌ విరుద్ధమైనదంటూ  అమెరికన్‌ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (సియాక్)ను  ఆశ్రయించింది. నిబంధనల ఉల్లంఘనకు గాను ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్‌ కూపన్స్‌కు లీగల్‌ నోటీసులు పంపింది. ‘కాంట్రాక్టు ప్రకారం మా హక్కులు కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున వివరాలను వెల్లడించలేం’ అని అమెజాన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు, ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు ఫ్యూచర్‌ గ్రూప్‌ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి అసెట్స్‌ విక్రయానికి సంబంధించి ఇతర వ్యాపార సంస్థలతో పాటు అమెజాన్‌కు కూడా ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆఫర్‌ ఇచ్చిందని, అది తిరస్కరించిన తర్వాతే రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నాయి. పైగా ఎఫ్‌డీఐ నిబంధనలు, ఫ్యూచర్‌ గ్రూప్‌లో తదుపరి పెట్టుబడులు పెట్టే హక్కులు మూడేళ్ల తర్వాతే అమెజాన్‌కు దఖలు పడనుండటం కూడా ఫ్యూచర్‌ సంస్థల్లో ఆ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రతిబంధకాలని వివరించాయి. 

వివరాల్లోకి వెడితే.. అమెజాన్‌ డాట్‌కామ్‌ గతేడాది ఆగస్టులో ఫ్యూచర్స్‌ కూపన్స్‌లో 49 శాతం వాటాలను ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసింది. అప్పట్లో ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థలో ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం వాటాలు ఉండేవి. ఒప్పంద నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత నుంచి పదేళ్ల లోపున ప్రమోటర్‌కు చెందిన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌కు అధికారాలు లభిస్తాయి. మరోవైపు, తన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ విభాగాలను రిలయన్స్‌కి విక్రయించేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఈ ఏడాది ఆగస్టులో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ డీల్‌ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. రిలయన్స్‌ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్‌ రిటైల్‌ కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే రూ. 37,700 కోట్ల పెట్టుబడులు సమీకరించి దూసుకెడుతున్న తరుణంలో ఫ్యూచర్‌-అమెజాన్‌ మధ్య వివాదం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు