వాస్తవాలు ఎందుకు దాచారు?

23 Jul, 2021 05:02 IST|Sakshi

ఫ్యూచర్‌ గ్రూప్‌తో వివాదంలో అమెజాన్‌కు సీసీఐ నోటీసు

న్యూఢిల్లీ: ఫ్యూచర్స్‌ గ్రూప్‌ తన రిటైల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ అసెట్స్‌ను రిలయన్స్‌కు విక్రయించడానికి సంబంధించి అమెజాన్‌తో జరుగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. వివాదానికి ప్రధాన మూలమైన 2019 నాటి అమెజాన్‌–ఫ్యూచర్స్‌ గ్రూప్‌ ఒప్పందం పూర్తి వివరాలను ఎందుకు వెల్లడించలేదని కాంపిటేటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందుకుగాను జరిమానాసహా తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదని నాలుగు పేజీల షో కాజ్‌ నోటీసు జారీ చేసింది.

ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న అమెజాన్‌–ఫ్యూచర్స్‌ న్యాయపోరాటంలో సీసీఐ తాజా నోటీసులు కీలక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... తన రిటైల్‌ అండ్‌ హోల్‌సేల్, లాజిస్టిక్స్‌ బిజినెస్‌ను రిలయన్స్‌ రిటైల్‌కు రూ.24,713 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఫ్యూచర్స్‌ గ్రూప్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 2020 ఆగస్టు 29న ప్రకటించింది. ఇది ఎంతమాత్రం తగదని 2020 అక్టోబర్‌లో అమెజాన్‌ సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.

ఫ్యూచర్‌ అన్‌లిస్టెడ్‌ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో (బీఎస్‌ఈ లిస్టెడ్‌ ఫ్యూచర్‌ రిటైల్లో ఫ్యూచర్స్‌ కూపన్స్‌ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్‌ వారెంట్స్‌ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్‌ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్‌ కూపన్స్‌ డీల్‌ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్‌ పేర్కొంది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌లో విచారణలో ఉంది. అయితే 2019 నాటి ఒప్పందం వివరాలను తనకు పూర్తిగా వెల్లడించలేదన్నది అమెజాన్‌కు వ్యాపారాల్లో గుత్తాధిపత్య నిరోధక రెగ్యులేటర్‌– సీసీఐ తాజా నోటీసుల సారాంశం. కాగా రిలయన్స్, ఫ్యూచర్స్‌ ఒప్పందం సింగపూర్‌ ట్రిబ్యునల్‌ విచారణ పరిధిలో ఉంటుందని సుప్రీంకు గురువారం అమెజాన్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు