అపోలో ఫార్మసీలో అమెజాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌!

9 Dec, 2020 13:43 IST|Sakshi

రూ. 740 కోట్ల పెట్టుబడులకు రెడీ?

క్లౌడ్‌ టెయిల్‌లో అమెజాన్‌కు 24 శాతం వాటా

ఆగస్ట్‌లో నెట్‌మెడ్స్‌లో 60 శాతం వాటా ఆర్‌ఐఎల్‌ చేతికి

1 ఎంజీలో మెజారిటీ వాటా కొనుగోలుపై టాటా గ్రూప్‌ కన్ను

వేడెక్కనున్న దేశీ ఆన్‌లైన్‌ ఫార్మసీ విభాగం

బెంగళూరు, సాక్షి: కోవిడ్-19 కారణంగా కొద్ది నెలలుగా ఆన్ లైన్ ఫార్మసీ రంగం జోరందుకుంది. దేశీ ఫార్మసిస్‌ రంగంపై కన్నేసిన గ్లోబల్ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా అపోలో ఫార్మసీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అపోలో ఫార్మసీలో 10 కోట్ల డాలర్లను(సుమారు రూ. 740 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఆంగ్ల మీడియా అభిప్రాయపడింది. ఇందుకు వీలుగా ఇప్పటికే ప్రారంభమైన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. దేశీయంగా ఓవైపు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మరోపక్క పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ ఫార్మసీ విభాగంలో విస్తరణకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఫార్మసీలో పెట్టుబడుల ద్వారా అమెజాన్‌ భారీ అడుగులు వేయాలని భావిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. తద్వారా దిగ్గజ కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలియజేశారు. చదవండి: (టాటాల చేతికి 1ఎంజీ?)

నెట్‌మెడ్స్‌
దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇటీవల ఆన్‌లైన్‌ ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. రూ. 620 కోట్లు వెచ్చించడం ద్వారా నెట్‌మెడ్స్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఆగస్ట్‌లోనే ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది. దీంతో డిజిటల్‌ అనుబంధ విభాగం రిలయన్స్‌ జియో.. ఈకామర్స్‌ రంగంలో ఔషధ విభాగంలోకి సైతం ప్రవేశించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జియోమార్ట్‌ పేరుతో ఆన్‌లైన్‌ గ్రాసరీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆర్‌ఐఎల్‌ డీల్‌ ప్రకారం నెట్‌మెడ్స్‌ విలువ రూ. 1,000 కోట్లకు చేరినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. ఆగస్ట్‌ మొదటి వారంలో ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. బెంగళూరులో ఆన్‌లైన్‌ ఫార్మసీ విక్రయాలు ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అప్పట్లోనే తెలియజేసింది. చదవండి: (రిలయన్స్‌ చేతికి నెట్‌మెడ్స్‌)

1 ఎంజీ
ఆన్‌లైన్ ఫార్మసీ కంపెనీ 1ఎంజీలో మెజారిటీ వాటా కొనుగోలుకి పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. తద్వారా ఈ విభాగంలో ప్రధాన కంపెనీలైన మెడ్ ప్లస్, నెట్ మెడ్స్, ఫార్మజీ, 1ఎంజీ మధ్య పోటీ తీవ్రతరం కానున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. నాలుగు నెలల క్రితమే నెట్ మెడ్స్ ప్రమోటర్ కంపెనీ విటాలిక్‌లో రిలయన్స్ రిటైల్ 60 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇదేవిధంగా క్లౌడ్ టెయిల్‌తో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. క్లౌడ్ టెయిల్లో అమెజాన్ 24 శాతం వాటా పొందింది. దేశీయంగా నెట్‌మెడ్స్‌, ఫార్మ్‌ఈజీ, మెడ్‌లైఫ్‌ తదితర పలు కంపెనీలు ఆన్‌లైన్‌ ద్వారా ఔషధ విక్రయాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు