-

అమెజాన్‌ లీగల్‌ ప్రతినిధుల రాంగ్‌రూట్‌.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌

21 Sep, 2021 08:54 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లోని కొందరు లీగల్‌ ప్రతినిధులపై వచ్చిన లంచం ఆరోపణలను అమెరికన్‌ ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సీరియస్‌గా తీసుకుంది. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

ఆరోపణలను నిర్ధారించడం గానీ లేదా ఖండించడంగానీ చేయని అమెజాన్‌..‘అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము‘ అని పేర్కొంది. ది మార్నింగ్‌ కాంటెక్ట్స్‌ అనే పత్రికలో వచ్చిన కథనాల ప్రకారం.. భారత్‌లో ప్రభుత్వాధికారులకు తమ లీగల్‌ ప్రతినిధులు కొందరు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై అమెజాన్‌ విచారణ ప్రారంభించింది. 

ఈ వ్యవహారంలో సీనియర్‌ కార్పొరేట్‌ కౌన్సెల్‌ను సెలవుపై పంపించింది. దీనిపైనే కంపెనీని వార్తా సంస్థలు సంప్రదించగా.. ఆరోపణలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయబోమని, విచారణ ప్రస్తుతం ఏ దశలో ఉందో చెప్పలేమని అమెజాన్‌ ప్రతినిధి పేర్కొన్నారు. విదేశాల్లో తమ వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు కోసం తమ సిబ్బంది ఎవరైనా ఆయా దేశాల ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చినట్లు ఆరోపణలు వస్తే.. అమెరికన్‌ కంపెనీలు వాటిని తీవ్రంగా పరిగణిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

సీబీఐతో విచారణ జరిపించాలి: సీఏఐటీ 
మరోవైపు, ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన వ్యవహారమని, అన్ని స్థాయిల్లో అవినీతి పేరుకుపోయిందన్న భావనను తొలగించేందుకు ప్రభుత్వం దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌కు లేఖ రాసింది.

అమెజాన్‌ లీగల్‌ ప్రతినిధుల మీద లంచాల ఆరోపణల అంశాన్ని అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) చైర్మన్‌ గ్యారీ గెన్సలర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భర్తియా తెలిపారు. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసే శక్తుల నుంచి దేశీ ఈ–కామర్స్‌ మార్కెట్‌ను కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. 

పోటీ సంస్థలను దెబ్బ తీసే విధంగా చౌక ధరలు, తన ప్లాట్‌ఫాంపై కొందరు విక్రేతలకు ప్రాధాన్యం ఇస్తూ ఇతర విక్రేతల అవకాశాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో అమెజాన్‌ మీద కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విచారణ చేస్తున్న తరుణంలో కంపెనీ ఈ వివాదంలో చిక్కుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు ఫ్యూచర్‌ గ్రూప్‌లో ఇన్వెస్టరయిన అమెజాన్‌.. ఆ సంస్థ, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ కుదుర్చుకున్న ఒప్పందంపై న్యాయపోరాటం కూడా చేస్తోంది. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టుల్లో అమెజాన్, ఫ్యూచర్‌ గ్రూప్‌ పరస్పరం దావాలు వేశాయి.

చదవండి: చైనాకు అమెజాన్‌ భారీ షాక్‌

మరిన్ని వార్తలు