రిటైల్‌లో అమెజాన్‌కు వాటా!- ఆర్‌ఐఎల్‌ రికార్డ్‌

24 Jul, 2020 14:40 IST|Sakshi

రిలయన్స్‌ రిటైల్‌లో అమెజాన్‌కు 10 శాతం వాటాపై అంచనాలు 

5 శాతం జంప్‌చేసిన ఆర్‌ఐఎల్‌ షేరు

రూ. 2161 వద్ద సరికొత్త గరిష్టానికి

రూ. 14 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్‌ విలువ 

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) రిటైల్‌ విభాగం రిలయన్స్‌ రిటైల్‌లో వాటా కొనుగోలుకి ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఆసక్తి చూపుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. రిలయన్స్‌ రిటైల్‌(ఆర్‌ఆర్‌ఎల్‌)లో అమెజాన్‌ దాదాపు 10 వాటాను కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్‌ కుదిరితే రిలయన్స్‌ రిటైల్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ. 3-4 లక్షల కోట్లకు చేరవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజులుగా అనధికార అన్‌లిస్టెడ్‌ షేర్ల మార్కెట్లో ఆర్‌ఆర్‌ఎల్‌ ఈక్విటీ షేరు విలువ 150 శాతం ప్రీమియంతో రూ.  1150-1200 వద్ద కదులుతున్నట్లు  తెలుస్తోంది. అయితే డీల్‌ ఆధారంగా ఆర్‌ఆర్‌ఎల్‌ విలువ రూ. 650-600 స్థాయికి దిగివచ్చే వీలున్నట్లు అభిషేక్‌ సెక్యూరిటీస్‌ నిపుణులు సందీప్‌ గినోడియా అంచనా వేశారు. దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. రిటైల్‌ విభాగం ఆర్‌ఆర్ఎల్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా 4:1 నిష్పత్తిలో అంటే 4 ఆర్‌ఆర్‌ఎల్‌ షేర్లకుగాను 1 ఆర్‌ఐఎల్‌ షేరుని జారీ చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.  అప్పట్లో ఆర్‌ఐఎల్‌ విలువ రూ. 1600కాగా.. రిలయన్స్ రిటైల్‌ విలువను రూ. 400-450గా అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌ రూ. 2000 మార్క్‌ను అధిగమించడంతో ఆర్‌ఆర్‌ఎల్‌ విలువ రూ. 500కు చేరవచ్చని జెన్‌నెక్ట్స్‌ నిపుణులు సునీల్‌ చందక్‌ పేర్కొన్నారు.

100 శాతం వాటా
రిలయన్స్‌ రిటైల్‌లో ఆర్‌ఐఎల్‌కు 99.95 శాతం వాటా ఉంది. అన్‌లిస్టెడ్‌ మార్కెట్లో 25 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. వెరసి ఆర్‌ఆర్‌ఎల్‌ మార్కెట్‌ విలువ రూ. 3 లక్షల కోట్లు పలకవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. రిలయన్స్‌ రిటైల్‌ బిజినెస్‌లోనూ వాటా విక్రయ యోచనలో ఉన్నట్లు ముకేశ్‌ అంబానీ ఏజీఎంలో సంకేతాలిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే జియో ప్లాట్‌ఫామ్స్‌కు లభించినంత ప్రీమియంను రిలయన్స్‌ రిటైల్‌ పొందలేకపోవచ్చని భావిస్తున్నారు. కాగా.. మరోవైపు కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ బిజినెస్‌ను ఆర్‌ఐఎల్‌ సొంతం చేసుకునే సన్నాహాల్లో ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు ఊహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 2161 వద్ద ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 14 లక్షల కోట్లను అధిగమించడం ద్వారా కొత్త చరిత్రను లిఖించడం విశేషం!  

మరిన్ని వార్తలు