Amazon:అమెజాన్‌లో పేమెంట్స్‌ త్వరలో ఇలా కూడా చేయొచ్చు..!

25 Jul, 2021 16:14 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  అమెజాన్‌ తన వినియోగదారులకు బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీలతో భవిష్యత్తులో చెల్లింపులు చేయవచ్చునని పేర్కొంది. అందుకోసం అమెజాన్‌ క్రిప్టోకరెన్సీ చెల్లింపులకు సంబంధించిన బ్లాక్‌చెయిన్‌ ప్రొడక్ట్‌ లీడ్‌ను, డిజిటల్‌ కరెన్సీ నిపుణుల బృందాల నియామకం జరపాలని భావిస్తోంది. అమెజాన్‌ తాజా జాబ్‌ లిస్ట్‌ ప్రకారం..డిజిటల్‌ కరెన్సీ, బ్లాక్‌ చెయిన్‌ టూల్స్‌కు చెందిన నిపుణులను నియమించుకోనుంది. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పేమెంట్స్‌ రోడ్‌మ్యాప్‌ను కూడా ఏర్పాటుచేయాలని భావిస్తోంది. 

కస్టమర్ అనుభవం, టెక్నికల్‌ స్ట్రాటజీ, సామర్థ్యాలతో పాటు లాంచ్ స్ట్రాటజీ కోసం క్రిప్టోకరెన్సీ  రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయడానికి అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌(AWS)తో సహా ఇతర ప్రొడక్ట్‌ డెవలపింగ్‌ కంపెనీలతో అమెజాన్‌ జత కట్టనుంది. ప్రస్తుతం అమెజాన్‌ క్రిప్టోకరెన్సీలను చెల్లింపులుగా అంగీకరించలేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రస్తుతం బ్లాక్‌చైన్‌ సేవలను అందిస్తోంది. గతంలో టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ కూడా  క్రిప్టోకరెన్సీతో చెల్లింపులను నిలిపివేసిన తిరిగి క్రిప్టోకరెన్సీతో చెల్లింపులు చేయవచ్చునని పేర్కొన్నాడు. 


 

మరిన్ని వార్తలు