రిలయన్స్‌-ఫ్యూచర్‌ డీల్‌పై సుప్రీంకు అమెజాన్

8 Apr, 2021 20:19 IST|Sakshi

ముంబై: ముకేశ్ అంబానీ ఆధ్వ‌ర్యంలోని రిల‌య‌న్స్ రిటైల్‌లో ఫ్యూచ‌ర్స్ రిటైల్ గ్రూప్ విలీన ప్ర‌క్రియ‌ను కొనసాగించేందుకు కిశోర్ బియానీకి అనుమతి ఇస్తూ ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గ్లోబ‌ల్ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. అమెజాన్ తన పిటిషన్ లో హైకోర్టు 22 మార్చి డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును "చట్టవిరుద్ధం" అన్యాయమని పేర్కొంది. రూ.24,713 కోట్ల‌కు రిల‌య‌న్స్ రిటైల్‌లో ఫ్యూచ‌ర్ గ్రూప్ విలీనానికి రెండు సంస్థ‌ల మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదిరిన సంగ‌తి తెలిసిందే.

ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్‌ కూపన్స్‌(ఎఫ్‌సీపీఎల్‌)లో అమెజాన్‌ కొంత వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటాలు ఉన్నందున.. అమెజాన్‌ కూడా పరోక్షంగా అందులోను స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్‌ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారాన్ని దాదాపు రూ.24,713 కోట్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి (ఆర్‌ఐఎల్‌) విక్రయించేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

డీల్‌కు అనుమతుల కోసం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్‌ తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్‌ సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్‌ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఢిల్లీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ని ఆశ్రయించింది.

చదవండి: జియో ఫైబర్ యూజర్లకు బంపర్ ఆఫర్!

మరిన్ని వార్తలు