Amazon: వారికి పండుగ బంపర్‌ ఆఫర్‌, 50శాతం ఫీజు కోత 

13 Sep, 2022 09:02 IST|Sakshi

కొత్త విక్రేతలకు అమెజాన్‌ పండుగ ఆఫర్‌ 

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ‘అమెజాన్‌ ఇండియా’ ముఖ్యమైన పండుగల ముందు విక్రేతలకు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలు నిర్వహించినందుకు చెల్లించాల్సిన ఫీజును 50 శాతం తగ్గిస్తున్నట్టు తెలిపింది. కొత్త వెండర్లకు ఇది వర్తించనుంది.

అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌లో విక్రయించే ప్రతీ ఉత్పత్తి విలువలో (కొనుగోలు దారు చెల్లించే) నిర్ణీత శాతం మేర ఫీజుగా వర్తకులు చెల్లించాల్సి ఉంటుంది. ‘‘కొత్త అమ్మకందారులు ప్రస్తుత పండుగల సీజన్‌లో ఈ–కామర్స్‌ ప్రయాణాన్ని వెంటనే ఆరంభించేందుకు వీలుగా.. అమెజాన్‌.ఇన్‌పై ఆగస్ట్‌ 28 నుంచి అక్టోబర్‌ 26 మధ్య నమోదు చేసుకుని.. తదుపరి 90 రోజుల్లోపు అమ్మకాలు మొదలు పెట్టడం ద్వారా అమ్మకం ఫీజులో 50 శాతం రాయితీ పొందొచ్చు’’అని అమెజాన్‌ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వర్తకులు ప్రస్తుత పండుగల డిమాండ్‌ నుంచి ప్రయోజనం పొందాలనుకుంటున్నట్టు తెలిపింది. ‘‘భారత్‌ వ్యాప్తంగా మాకు మిలియన్‌ విక్రేతలు ఉన్నారు. పండుగల సీజన్‌లో వారంతా తమ ఉత్పత్తులను వినియోగదారుల ముందు ప్రదర్శించే అవకాశం మా వేదిక ద్వారా ఉంటుంది’’అని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ వివేక్‌ సోమారెడ్డి వెల్లడించారు. అమెజాన్‌కు దేశవ్యాప్తంగా 60 ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు, 1850 వరకు స్టేషన్లు (సొంతంగా, భాగస్వాముల ద్వారా) ఉన్నాయి.   


 

మరిన్ని వార్తలు