కరోనా ఎఫెక్ట్: అమెజాన్ కస్టమర్లకు షాక్!

9 May, 2021 15:41 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిత్యం లక్షల సంఖ్యలో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ సారి యువకులు సైతం ఈ కరోనా మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గ‌జం అమెజాన్ కీలక నిర్ణ‌యం తీసుకుంది. అమెజాన్ ఇటీవ‌లే ప్రైమ్ డే సేల్ పేరిట ఓ భారీ సేల్‌ను ప్ర‌క‌టించింది. ప్రతి ఏడాది నిర్వ‌హించే సేల్‌లో భాగంగా ఈ సారి కూడా అమెజాన్ ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి వాటిపై భారీగా ఆఫర్లను ప్ర‌క‌టించింది. 

అయితే.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అమెజాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భార‌త్‌లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రైమ్‌ డే సేల్‌ను వాయిదా వేస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా పేర్కొంది. గ‌త ఏడాది సైతం క‌రోనా కారణంగా ఈ సేల్‌ను అమెజాన్ ఆగ‌స్టు నెలలో నిర్వ‌హించింది. కరోనా వ్యాప్తి, పలు చోట్ల లాక్ డౌన్ల నేపథ్యంలో డెలివరీలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతోనే అమెజాన్ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ సైతం కరోనా కారణంగా పలు స్మార్ట్ ఫోన్ల లాంఛ్ ఈవెంట్లను వాయిదా వేసింది. సంస్థ వార్షికోత్సవ వేడుకలను కూడా వాయిదా వేసినట్లు రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ తెలిపారు.

చదవండి:

లక్షల మందిని రక్షించిన సింగిల్ రిపోర్ట్!

మరిన్ని వార్తలు