అమెజాన్‌లో 10 వేల ఉద్యోగాలు కట్‌.. 

16 Nov, 2022 02:29 IST|Sakshi

న్యూయార్క్‌: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల్లో కోతల పర్వం కొనసాగుతోంది. తాజాగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల తరహాలోనే ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా రాబోయే రోజుల్లో దాదాపు 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కార్పొరేట్‌ ఉద్యోగుల సంఖ్యలో ఇది మూడు శాతం కాగా అంతర్జాతీయంగా ఉన్న సిబ్బంది సంఖ్యలో ఒక్క శాతం కన్నా తక్కువని న్యూయార్క్‌ టైమ్స్‌ (ఎన్‌వైటీ) ఒక కథనాన్ని ప్రచురించింది.

వాయిస్‌ అసిస్టెంట్‌ అలెక్సాతో పాటు డివైజ్‌ల విభాగం, రిటైల్, మానవ వనరుల విభాగంలో ఈ కోతలు ఉండనున్నాయని పేర్కొంది. కొన్నాళ్లుగా అమెజాన్‌లో ఈ ధోరణులు కనిపిస్తూనే ఉన్నాయని ఎన్‌వైటీ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ మధ్యకాలంలో అమెజాన్‌ 80,000 పైచిలుకు సిబ్బందిని తగ్గించుకున్నట్లు పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది గంటల ప్రాతిపదికన పని చేసేవారే ఉన్నట్లు వివరించింది.

చిన్న బృందాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ను సెప్టెంబర్‌లోనే నిలిపివేసిందని, అలాగే అక్టోబర్‌లో కీలకమైన రిటైల్‌ వ్యాపారంలోనూ 10,000 పైచిలుకు ఖాళీలను భర్తీ చేయకుండా ఆపేసిందని ఎన్‌వైటీ పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు బాగా లేకపోవడంతో వ్యాపారాన్ని వేగంగా క్రమబద్ధీకరించుకునేలా అమెజాన్‌పై ఒత్తిడి పెరిగిపోతోందని వివరించింది. ఎలాన్‌ మస్క్‌ చేతికి వచ్చిన తర్వాత మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో దాదాపు సగం మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. మెటా (ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ) కూడా 11,000 మంది పైచిలుకు సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు