రేపటి నుంచీ గ్లోబల్‌ హాలిడే అమ్మకాలు

25 Nov, 2020 10:32 IST|Sakshi

ఈ నెల 26 నుంచి 30 వరకూ విక్రయాలు

బ్లాక్‌ ఫ్రైడే నుంచి సైబర్‌ మండే వరకూ ఆఫర్లు

గ్లోబల్‌ సెల్లింగ్‌లో 70,000 మంది ఎగుమతిదారులు

వేల కొద్దీ మేడిన్‌ ఇండియా ప్రొడక్టుల విక్రయం

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వెల్లడి

న్యూఢిల్లీ, సాక్షి: గురువారం నుంచీ ప్రారంభంకానున్న గ్లోబల్‌ హాలిడే సీజన్‌లో భాగంగా ప్రొడక్టులను విక్రయించేందుకు దేశీ ఎగుమతిదారులు సిద్ధంగా ఉన్నట్లు ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వెల్లడించింది. వార్షికంగా నిర్వహించే బ్లాక్‌ ఫ్రైడే, సైబర్‌ మండేలలో భాగంగా ఈ నెల 26 నుంచి 30 వరకూ అమ్మకాలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. గ్లోబల్‌ సెల్లింగ్‌కు వీలుగా 70,000 మంది దేశీ ఎగుమతిదారులు తమ ప్రొడక్టులను లిస్టింగ్‌ చేసినట్లు పేర్కొంది. తద్వారా వేల కొద్దీ మేడిన్‌ ఇండియా ప్రొడక్టులను విక్రయానికి ఉంచినట్లు తెలియజేసింది. గతేడాది బ్లాక్‌ ఫ్రైడే సందర్భంగా 76 శాతం అధికంగా అమ్మకాలు నమోదుకాగా.. సైబర్‌ మండే రోజున సైతం 55 శాతం వృద్ధి కనిపించినట్లు ప్రస్తావించింది.

గిఫ్ట్‌ ఐటమ్స్‌
ప్రపంచవ్యాప్తంగా తమ కస్టమర్లకు వేలకొద్దీ ప్రొడక్టులు అందుబాటులోకి రానున్నట్లు అమెజాన్‌ పేర్కొంది. స్టెమ్‌ టాయ్స్‌, ఫ్యాషన్‌ జ్యువెలరీ, టీ, తదితర పానీయాల  దగ్గర్నుంచి.. బ్యూటీ ప్రొడక్ట్స్‌, లెదర్‌ జర్నల్స్‌, బ్యాగుల వంటి పలు గిఫ్టింగ్‌ ప్రొడక్టులను సైతం విక్రయానికి ఉంచినట్లు తెలియజేసింది. యూఎస్‌లో బ్లాక్‌ ఫ్రైడే నుంచి సైబర్‌ మండే వరకూ హాలిడే సీజన్‌ ప్రారంభమవుతుందని, దీనిలో భాగంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు బహుమతులను ఇస్తుంటారని వివరించింది. థ్యాంక్స్‌ గివింగ్‌ మర్నాడు సెలబ్రేట్‌ చేసుకునే బ్లాక్‌ ఫ్రైడేపై రిటైలర్లు అధికంగా దృష్టి సారిస్తుంటారని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక డీల్స్‌ను కంపెనీలు ప్రకటిస్తాయని తెలియజేసింది.

పలు విభాగాలలో
ఆరోగ్యం, పరిశుభ్రత, న్యూట్రిషనల్‌ సప్లిమెంట్స్‌, గృహ అవసరాలు తదితర విభాగాలలో మేడిన్‌ ఇండియా ప్రొడక్టులకు భారీ డిమాండ్‌ కనిపిస్తుంటుందని అమెజాన్‌ పేర్కొంది. యూఎస్‌, కెనడా, యూరోప్‌, జపాన్‌ తదితర దేశాల నుంచి ప్రొడక్టులకు ఆర్డర్లు లభిస్తుంటాయని తెలియజేసింది. దేశీయంగా పండుగల సీజన్‌ తదుపరి ప్రారంభమయ్యే యూఎస్‌ హాలిడే సీజన్‌ ఇక్కడి ఎగుమతిదారులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని అమెజాన్ ఇండియా గ్లోబల్‌ ట్రేడ్‌ డైరెక్టర్‌ అభిజిత్‌ కామ్రా పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలు, చిన్న ఎగుమతిదారులకు కంపెనీ ఇన్వెంటరీ నిర్వహణ, లాజిస్టిక్‌ సొల్యూషన్స్ తదితర అంశాలలో సహకారాన్ని అందిస్తుందని తెలియజేశారు. 2015లో గ్లోబల్‌ సెల్లింగ్‌ కార్యక్రమాన్ని 100 మంది ఎగుమతిదారులతో ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం 70,000 మంది ఎగుమతిదారులకు విస్తరించినట్లు తెలియజేశారు. మొత్తంగా చూస్తే ఈ కార్యక్రమం ద్వారా ఎగుమతులు 2 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. 2025కల్లా 10 బిలియన్‌ డాలర్ల బిజినెస్‌ అందుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు