చైనా ఎకానమీకి ఘోరంగా దెబ్బేసిన అమెజాన్‌?.. ఫ్లస్‌ పరువూ పాయే!

20 Sep, 2021 13:30 IST|Sakshi

ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీ అమెజాన్‌.. చైనాకు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది.  తన ప్లాట్‌ఫామ్‌​ నుంచి చైనాకు చెందిన 3,000 ఆన్‌లైన్‌ స్టోర్‌లను మూసేస్తున్నట్లు(తొలగిస్తున్నట్లు) ప్రకటించింది. అంతేకాదు ఇవి ప్రమోట్‌ చేసిన 600 చైనా బ్రాండ్‌లను సైతం ప్రొడక్ట్‌ లిస్ట్‌ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. 


అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌, చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటోందా?.. అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు.  ఫేక్‌ రివ్యూలతో ప్రొడక్టులను ప్రమోట్‌ చేస్తున్న ఆన్‌లైన్‌ స్టోర్‌లను మూసేస్తున్నట్లు(యాప్‌ నుంచి తొలగిస్తున్నట్లు), 600 బ్రాండ్‌లను తీసేస్తున్నట్లు ప్రకటించి చైనాకు పెద్ద షాక్‌ ఇచ్చింది. ఈ హఠాత్‌ నిర్ణయంతో సుమారు 130 మిలియన్ల రెన్‌మింబి (చైనీస్‌ యువాన్‌) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

ఫేక్‌ రివ్యూలతో పాటు ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించినందుకు తొలగించినట్లు తెలిపింది.  ‘మేడ్‌ ఇన్‌ చైనా.. సోల్డ్‌ ఇన్‌ అమెజాన్‌’ పేరుతో ఏర్పాటైన మర్చంట్‌ కమ్యూనిటీ ఈ తతంగాన్ని ఇంతకాలం నడిపిస్తూ వస్తోంది. ఇదంతా వినియోగదారుల సమీక్ష ఉల్లంఘన కిందకు వస్తుందని అమెజాన్‌ పేర్కొంది. నిజానికి చైనా యాప్‌ల విషయంలో అమెజాన్‌ ఇలా కఠినంగా వ్యవహరించడం ఇదేం కొత్త కాదు.
 

న్యాయపరమైన చర్యలు కూడా..
ప్రోత్సాహక రివ్యూలను 2016 నుంచి అమెజాన్‌ సంస్థ బ్యాన్‌ చేసింది. అంతేకాదు అలాంటి ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షిస్తోంది కూడా.  అయినప్పటికీ చైనా మార్కెట్‌లో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణం అయ్యాయి.  అయితే అమెజాన్‌ మాత్రం ఇలాంటి చర్యల్ని ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. ఈ ఏడాది మే నుంచి రంగంలోకి దిగి..  చర్యలను మొదలుపెట్టింది. దీనివల్ల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడిందని ట్రేడ్‌ గ్రూప్‌ షెంజెన్‌ క్రాస్‌ బార్డర్‌ ఈ-కామర్స్‌ అసోషియేషన్‌ వెల్లడించింది. అయితే ప్రస్తుతం తీసుకున్న చర్యలు..  మునుపటి కంటే తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.  సస్పెండ్‌, బ్యాన్‌తో పాటు న్యాయపరమైన చర్యలకు సిద్ధపడుతోంది అమెజాన్‌.

అమెజాన్‌ కాకుంటే ఇంకొకటి..
అయితే అమెజాన్‌ చర్యలు.. చైనా ఈ-కామర్స్‌ మార్కెట్‌పై ప్రభావం చూపెట్టకపోవచ్చని చైనా మీడియా హౌజ్‌ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. చైనా తొలగించిన ఆన్‌లైన్‌ స్టోర్‌లు, బ్రాండ్‌లు..  ఈబే, అలీఎక్స్‌ప్రెస్‌ వైపు మళ్లుతున్నట్లు చెబుతోంది. ఇక అమెజాన్‌ సైతం ఈ వివాదంపై స్పందించింది.  అమెజాన్‌ కేవలం చైనాను మాత్రమే టార్గెట్‌ చేయలేదని..  మిగతా దేశాల్లోనూ ఈ తరహా చర్యలు చేపట్టినట్లు అమెజాన్‌ ఆసియా గ్లోబల్‌ సెల్లింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిండీ థాయ్‌ వెల్లడించారు. తమ నిర్ణయం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందన్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ చెప్తున్నారామె.  ఈ పోటాపోటీ స్టేట్‌మెంట్ల నడుమ మిలియన్ల విలువ చేసే చైనీస్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ల ఫండ్స్‌ను అమెజాన్‌ నిలిపివేయడం ఆసక్తికర పరిణామం అనే చెప్పొచ్చు.

చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయింది చైనావోడే!   

మరిన్ని వార్తలు