భారత్‌లో అమెజాన్‌ ‘ధన’బలం! 

22 Sep, 2021 04:18 IST|Sakshi

రెండేళ్లలో లీగల్‌ ఫీజులు రూ. 8,546 కోట్లు

వ్యాపారం పటిష్టతకు ప్రయత్నాల్లో భాగమని కథనాలు

అవినీతికి చిరునామా అని సీఏఐటీ విమర్శ

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌

న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కార్యకలాపాలు పటిష్టంకావడానికి ఆ సంస్థ న్యాయ ప్రతినిధులు దేశంలో కేవలం రెండేళ్లలో రూ.8,646 కోట్ల (1.2 బిలియన్‌ డాలర్లు) న్యాయపరమైన వ్యయాలు (లీగల్‌ ఫీజులు)  చేసినట్లు వచ్చిన వార్తా కథనాలు సంచలనం రేపుతున్నాయి.

దేశంలో అమెజాన్‌ పబ్లిక్‌ అకౌంట్‌ ఫైలింగ్స్‌ గురించి సమాచారం తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ వెలువడిన వార్తల ప్రకారం, అమెజాన్‌ రిటైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, అమెజాన్‌ సెల్లర్స్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, అమెజాన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, అమెజాన్‌ హోల్‌సేల్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్, అమెజాన్‌ ఇంటర్నెట్‌సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌సహా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే ఈ–కామర్స్‌ దిగ్గజ విభాగాలు 2018–19లో 3,420 కోట్ల లీగల్‌ ఫీజులు చెల్లించగా, 2019–20లో ఈ విలువ రూ. 5,126 కోట్లుగా ఉంది. ఈ రెండేళ్లలో అమెజాన్‌ మొత్తం ఆదాయంలో ఇది దాదాపు 20 శాతమని కూడా సంబంధిత వర్గాలు అంచనా. 

అవినీతి మయం: సీఏఐటీ 
కాగా ఈ వార్తాకథనాలపై అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రంగా స్పందించింది. ఈ స్థాయి వ్యయాలు ప్రశ్నించదగినవిగా పేర్కొంది. ‘‘భారత్‌లో తన కార్యకలాపాల కొనసాగింపు, పటిష్టత లక్ష్యంగా భారత్‌ ప్రభుత్వ అధికారులను అమెజాన్, దాని అనుబంధ సంస్థలు ఎలా మభ్యపెడుతున్నాయి, లంచాలు ఇవ్వడానికి తమ ఫైనాన్షియల్‌ బలాన్ని ఎలా వినియోగించుకుంటున్నాయి అన్న అంశాన్ని ఆ సంస్థ న్యాయ ప్రతినిధులు చెల్లించిన న్యాయపరమైన భారీ ఫీజులు తెలియజేస్తున్నాయి’’ అని వాణిజ్య మంత్రిత్వశాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌కు రాసిన ఒక లేఖలో సీఏఐటీ నేషనల్‌ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ పేర్కొన్నారు. అయితే తన ఆరోపణలకు ఆయన ఎటువంటి సాక్ష్యాలను చూపించని ఆయన, ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు విభాగం (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.  రెండేళ్లలో వచ్చిన దాదాపు రూ.45,000 కోట్ల టర్నోవర్‌పై రూ.8,500 కోట్లు న్యాయపరమైన వ్యయాలు చేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు.  

కథనాలపై స్వయంగా విచారణ ప్రారంభించిన అమెజాన్‌ 
కాగా, ఈ వ్యవహారంపై అమెజాన్‌ స్వయంగా విచారణ ప్రారంభించింది. ఈ అంశంలో సీనియర్‌ కార్పొరేట్‌ న్యాయవాదిని ఒకరిని సెలవుపై పంపినట్లు కూడా తెలుస్తోంది. ఆరోపణలను ధృవీకరించడంకానీ లేదా ఖండించడంకానీ చేయని అమెజాన్, ఆరోపణలపై పూర్తి స్థాయిలో తగిన విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది. అవినీతి ఏదైనా జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇందుకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

ప్రధాన న్యాయ వివాదాలు ఇవీ.. 
ఫ్యూచర్‌ గ్రూప్‌ను రిలయన్స్‌ కొనుగోలు (రూ.24,713 కోట్ల ఒప్పందానికి సంబంధించి) వ్యవహారాన్ని సవాలుచేస్తూ, దేశంలో అమెజాన్‌ అతిపెద్ద న్యాయపరమైన వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యాయ వివాదం సుప్రీంకోర్టు, సింగపూర్‌ ఆర్ర్‌బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌లో నలుగుతోంది. దేశంలో దాదాపు రూ.లక్ష కోట్ల రిటైల్‌ వ్యాపారాన్ని చేజిక్కించుడానికి జరుగుతున్న వాణిజ్య యుద్ధంగా దీనిని పలువురు అభివర్ణిస్తున్నారు.

ఇక  ప్రత్యర్థుల వ్యాపారాలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని తమపై వచ్చిన ఆరోపణలను విచారించరాదని కోరుతున్న  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సుప్రీంకోర్టులో ఇటీవలే ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో కాంపిటేటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విచారణను నిలువరించాలన్న అమెరికా ఈ–కామర్స్‌ దిగ్గజ కంపెనీల అప్పీలేట్‌ పిటిషన్లను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ అంశం విషయంలో కర్ణాటక హైకోర్టులో ఓడిపోయిన రెండు ఈ–కామర్స్‌ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

అమెరికా సంస్థలు తమ ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లలో ఎంపిక చేసిన విక్రేతలను ప్రోత్సహిస్తున్నాయని, తద్వారా పోటీని అణిచివేసే వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. ‘‘క్రిమినల్‌ చట్టం కింద ఏదైనా ఫిర్యాదు దాఖలైతే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేస్తారు. ఆ నమోదుకు ముందే నోటీసు ఇవ్వండి అన్నట్లు ఉంది మీ వాదన’’ అని కూడా త్రిసభ్య ధర్మాసనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం.  ఈ– కామర్స్‌ కంపెనీలు ఈ తరహా ఆరోపణలపై విచారణను అడ్డుకుంటూ కోర్టుల్లో సవాలు చేయడం తగదని వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ కూడా తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు