వొడాఫోన్‌ ఐడియాకు వెరిజాన్‌, అమెజాన్‌ దన్ను!

3 Sep, 2020 11:19 IST|Sakshi

వొడాఫోన్‌ ఐడియాలో పెట్టుబడులకు విదేశీ దిగ్గజాల ఆసక్తి

4 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రణాళికల్లో కంపెనీలు

ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు సంబంధితవర్గాల అంచనా

మొబైల్‌ సేవల కంపెనీ వొడాఫోన్‌ ఐడియాలో విదేశీ దిగ్గజాలు వెరిజాన్‌, అమెజాన్‌ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. వొడాఫోన్‌ ఐడియాలో వాటా కొనుగోలుకి ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. సంబంధిత కథనం ప్రకారం ఏజీఆర్‌ బకాయిల కేసుపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో చర్చలు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, యూఎస్‌ వైర్‌లెస్‌ సేవల దిగ్గజం వెరిజాన్‌ కమ్యూనికేషన్స్‌ 400 కోట్ల డాలర్లు(సుమారు రూ.29,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. పదేళ్లలోగా ఏజీఆర్ బకాయిలను చెల్లించమంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తిరిగి వొడాఫోన్‌ ఐడియాలో వాటా కొనుగోలుకి విదేశీ దిగ్గజాలు చర్చలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

రూ. 50,000 కోట్లు
బ్రిటిష్‌ దిగ్గజం వొడాఫోన్‌ గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ భాగస్వామ్య సంస్థ వొడాఫోన్‌ ఐడియా సుమారు రూ. 50,000 కోట్లమేర ఏజీఆర్‌ బకాయిలను చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. సుప్రీం ఆదేశాలమేరకు ఇప్పటికే కంపెనీ రూ. 7,850 కోట్లను చెల్లించిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. 

షేరు జోరు
అమెజాన్‌, వెరిజాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ యోచనలో ఉన్న అంచనాలతో ఇటీవల వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో మూడు రోజులుగా ఈ షేరు దూకుడు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 10.70 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 11.30 వరకూ ఎగసింది. 

మరిన్ని వార్తలు