ఫ్యూచర్‌గ్రూపు, అమెజాన్‌ వివాదంలో మరో మలుపు!

23 Nov, 2021 08:57 IST|Sakshi

వివాదంలో రాజీకి అమెజాన్‌ సిద్ధమైందా?

సీసీఐ వద్ద ఫెమా ఉల్లంఘనల కేసు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి 

న్యూఢిల్లీ: కిషోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌గ్రూపుతో సయోధ్యకు అమెజాన్‌ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెజాన్‌కు వ్యతిరేకంగా ఫెమా ఉల్లంఘనలపై సీసీఐ వద్ద ఫ్యూచర్‌ గ్రూపు కేసు దాఖలు చేసింది. అమెజాన్‌లో పెట్టుబడులకు ఆమోదం తీసుకునే విషయంలో సీసీఐ వద్ద వాస్తవాలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టు ఫ్యూచర్‌ గ్రూపు ఆరోపిస్తోంది. ఈకేసును వెనక్కి తీసుకోవాలని ఫ్యూచర్‌ గ్రూపును అమెజాన్‌ కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

పెట్టుబడులకు సంబంధించి తమ మధ్య వివాదానానికి ముగింపు విషయమై ఇరు వర్గాలు చర్చించినట్టు కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్‌ గ్రూపు తన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్‌ వ్యాపారాలను రిలయన్స్‌కు విక్రయించేందుకు గతేడాది ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఫ్యూచర్‌ రిటైల్‌లో పెట్టుబడులు కలిగిన అమెజాన్‌ ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించడంతో ఇది నిలిచిపోయింది. అమెజాన్‌ పక్కకు తప్పుకుంటే చెల్లించాల్సిన పరిహారంపైనా చర్చించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఈ విషయాన్ని తప్పుదోవపట్టించేదిగా, కల్పితంగా అమెజాన్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఫ్యూచర్‌ రిటైల్‌కు సాయం చేసేందుకు అమెజాన్‌ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.   
 

చదవండి: అమెజాన్‌ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీం కోర్టును కోరిన ఎఫ్‌ఆర్‌ఎల్‌

మరిన్ని వార్తలు