భారత్‌లో అమెజాన్‌ మరిన్ని పెట్టుబడులు

30 Sep, 2020 08:02 IST|Sakshi

అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌లో రూ. 1,125 కోట్లు 

సాక్షి, న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ అమ్మకాల కోసం ఈ–కామర్స్‌ సంస్థలు భారీ సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్‌ కొత్తగా మరో రూ. 1,125 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. భారత్‌లోని అనుబంధ విభాగం అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌లో (ఏఎస్‌ఎస్‌) అమెజాన్‌ కార్పొరేట్‌ హోల్డింగ్స్‌ (సింగపూర్‌), అమెజాన్‌ డాట్‌కామ్‌ (మారిషస్‌) సంస్థలు ఈ మేరకు పెట్టుబడులు పెట్టాయి. దీనికి ప్రతిగా ఆ సంస్థలకు అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌ ఈక్విటీ షేర్లను కేటాయించింది. ప్రత్యర్థి సంస్థలు ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్‌లతో పోటీపడేందుకు అమెజాన్‌కు తాజా పెట్టుబడులు తోడ్పడనున్నాయి.

అమెజాన్‌ ఇటీవల జూన్‌లోనే ఏఎస్‌ఎస్‌లో రూ. 2,310 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. చిన్న, మధ్య తరహా సంస్థలను ఆన్‌లైన్‌ బాట పట్టించే దిశగా భారత్‌లో సుమారు రూ. 7,000 కోట్లు పైచిలుకు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. అంతకు ముందే భారత్‌లో 5.5 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయబోతున్నట్లు అమెజాన్‌ వెల్లడించింది. మరోవైపు, పండుగ సీజన్‌ కోసం పోటీ కంపెనీలు కూడా భారీ పెట్టుబడులతో సిద్ధమవుతున్నాయి.

మరిన్ని వార్తలు