అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు

1 Mar, 2021 12:54 IST|Sakshi

మాకు సంబంధంలేదు : జైష్-ఉల్-హింద్

సాక్షి, ముంబై: ఆసియా కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో నిండిన స్కార్పియో  వాహనం రేపిన దుమారం అంతా ఇంతా కాదు.  తాజాగా  ఇదే అంశంపై మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచింది తామేనని  'జైష్‌ ఉల్‌ హింద్‌' సంస్థ ప్రకటించిందన్నవార్త ఫేక్‌న్యూస్‌ అంటూ జైష్-ఉల్-హింద్  చేసిన తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. (అంబానీ ఇంటికి బెదిరింపుల కేసులో ట్విస్ట్‌)

టెలిగ్రామ్‌ యాప్‌లో మెసేజ్‌ ద్వారా తామే దీనికి బాధ్యత వహిస్తున్నట్లు వచ్చిన నివేదికలను ఖండించింది. ఈ మేరకు జైష్-ఉల్-హింద్ ఒక ప్రకటన విడుదల చేసిందని బిజినెస్‌ టుడే నివేదించింది. టెలిగ్రామ్ ఖాతాలో,  జైష్-ఉల్-హింద్ పేరిట విడుదల చేసిన పోస్టర్‌తో తమకు సంబంధంలేదని, తప్పుడు వార్తలని పేర్కొంది. 'జైష్-ఉల్-హింద్ నుండి అంబానీకి ముప్పు లేదు'  అనే పేరుతో వెల్లడించిన వివరణలో ‘‘తమ పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ ఫాసిజానికి వ్యతిరేకంగా మాత్రమే. హిందూ అమాయక ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. మా పోరాటం షరియా కోసం, డబ్బు కోసం కాదు. లౌకిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం గానీ అంబానీకి వ్యతిరేకంగా కాదు’’ అని తెలిపింది. అలాగే తాము అవిశ్వాసులనుంచి డబ్బులు తీసుకోమని, భారతీయ వ్యాపార దిగ్గజాలతో తమకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. మార్ఫింగ్‌ ఫోటోలతో భారత నిఘా సంస్థ నకిలీ పోస్టర్లు తయారు చే‍స్తోందంటూ మండిపడింది. (అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ)

కాగా ఫిబ్రవరి 25న ముఖేశ్‌ అంబానీ ఇంటిముందు  పేలుడు పదార్థాలతో ఒక వాహనం నిలిపి ఉంచడం కలకలం రేపింది. ఇది ట్రైలర్‌ మాత్రమే..అని హెచ్చరించడంతోపాటు బిట్‌కాయిన్ ద్వారా డబ్బు డిమాండ్ చేసినట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి. అంతేకాదు  "మీకు వీలైతే మమ్మల్ని ఆపండి" అని దర్యాప్తు సంస్థలకు  జైష్-ఉల్-హింద్‌ సవాల్‌ విసిరిందన్న వార్త మరింత ఆందోళన రేపింది.  దీంతో ముంబై పోలీసులు అంబానీ ఇంటిముందు భారీ భద్రతను  విధించారు. ఈ కేసును 10 పోలీసు బృందాలు, ఎన్‌ఐఏ సంయుక్తంగా విచారిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు