యాంబర్‌ పతనం- జూబిలెంట్‌ ఫుడ్‌ జోరు

11 Sep, 2020 15:21 IST|Sakshi

క్విప్‌ నేపథ్యంలో రెండో రోజూ డీలా

8 శాతం పతనమైన యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌

క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలు

5 శాతం అప్‌- కొత్త గరిష్టానికి జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌

మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ట్రేడవుతున్నాయి. కాగా.. క్విప్‌ ముగిసిన నేపథ్యంలో యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాల కారణంగా జూబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు నష్టాలతో డీలాపడగా.. ఫాస్ట్‌ఫుడ్‌ చైన్‌ దిగ్గజం జూబిలెంట్‌‌ ఫుడ్‌ వర్క్స్‌ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) ద్వారా యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 400 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 1,780 ధరలో చేపట్టిన క్విప్‌ గురువారం(10న) ముగిసింది. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 9.6 శాతం కుప్పకూలి రూ. 1,723ను తాకింది. ప్రస్తుతం 8 శాతం నష్టంతో రూ. 1,757 వద్ద ట్రేడవుతోంది. వెరసి మంగళవారం నమోదైన ఇంట్రాడే గరిష్టం రూ. 1,997తో పోలిస్తే 12 శాతం నీరసించింది.

జూబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో మెరుగైన ఫలితాలు ప్రకటించగలదన్న అంచనాలతో  జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ కౌంటర్‌ మరోసారి బలపడింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 2,378వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 2.5 శాతం లాభంతో రూ. 2,322 వద్ద ట్రేడవుతోంది. క్యూ1 ఫలితాల సందర్భంగా కంపెనీ జులై, ఆగస్ట్‌లలో అమ్మకాలు సగటున 77 శాతం చొప్పున పుంజుకున్నట్లు వెల్లడించింది. 

మరిన్ని వార్తలు