యాంబర్‌ - స్పెన్సర్స్‌.. జూమ్‌

19 Oct, 2020 12:48 IST|Sakshi

ఏసీ దిగుమతులపై నిషేధం ఎఫెక్ట్‌

10 శాతం దూసుకెళ్లిన యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌

రాధాకిషన్‌ దమానీ వాటా కొనుగోలు

7 శాతం జంప్‌చేసిన స్పెన్సర్స్‌ రిటైల్‌

హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 347 పాయింట్లు జంప్‌చేసి 40,330ను తాకింది. నిఫ్టీ 86 పాయింట్లు ఎగసి 11,848 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో డీమార్ట్‌ స్టోర్ల ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో రిటైల్‌ రంగ కంపెనీ స్పెన్సర్స్‌ రిటైల్‌ వెలుగులోకి వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏసీ దిగుమతులపై నిషేధాన్ని ప్రకటించడంతో కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ దిగ్గజం యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్
రిఫ్రిజిరేంట్స్‌సహా ఎయిర్‌ కండిషనర్ల(ఏసీ) దిగుమతులపై విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీఎఫ్‌టీ) నిషేధం విధించిన వార్తలతో రెండు రోజులుగా యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌ వెలుగులో నిలుస్తోంది. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 2,410 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,340 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్‌ 18 శాతం జంప్‌చేసింది. 

స్పెన్సర్స్‌ రిటైల్‌
డీమార్ట్‌ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ క్యూ2లో (జులై-సెప్టెంబర్‌) స్పెన్సర్స్‌ రిటైల్‌లో అదనపు వాటాను కొనుగోలు చేశారు. ఈ ఏడాది జూన్‌ చివరికల్లా స్పెన్సర్స్‌ రిటైల్‌లో రాధాకిషన్‌ దమానీ 2.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. స్పెన్సర్స్‌ రిటైల్‌ బీఎస్‌ఈకి అందించిన వివరాల ప్రకారం సెప్టెంబర్‌కల్లా దమానీ వాటా 2.20 శాతానికి పెరిగింది. వెరసి 3.25 లక్షల స్పెన్సర్స్‌ షేర్లను దమానీ క్యూ2లో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో స్పెన్సర్స్‌ రిటైల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 7 శాతం వరకూ ఎగసింది. రూ. 78 సమీపంలో ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3 శాతం బలపడి రూ. 75 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు