Oil Prices: అమెరికాలో కరువు.. ఇండియా వంటగదిలో పిడుగు

15 Jun, 2021 17:52 IST|Sakshi

మండిపోతున్న మంచినూనె ధరలుఅమెరికాలో తగ్గిన నూనె గింజల దిగుబడి

పెరిగిన నూనె ముడి పదార్థాల ధరలు

నాలుగు నెలల్లో రెట్టింపైన ధరలు

మారిపోయిన మధ్య తరగతి బడ్జెట్‌ ముఖచిత్రం 

న్యూఢిల్లీ : అమెరికా, బ్రెజిల్‌లలో వచ్చిన కరువు.. ఇండియా పాలిట శాపంగా మారింది. అక్కడ పంట ఉత్పత్తులు తగ్గితే దాని ఎఫెక్ట్‌ ఇండియాపై పడింది. అక్కడ నూనె గింజల ఉత్పత్తి తగ్గితే ఇక్కడ వంట నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

తగ్గిన దిగుబడి
ఇండియాను మించిన విధ్వంసాన్ని అమెరికా, బ్రెజిల్‌లలో సృష్టించింది కరోనా మహమ్మారి. లక్షల సంఖ్యలో కేసులు వేల సంఖ్యలో మరణాలు అక్కడ నమోదు అయ్యాయి. దీంతో గతేడాది ఆ రెండు దేశాల్లో వంట నూనె తయారీలో ఎక్కువగా ఉపయోగించే సోయా దిగుబడి తగ్గిపోయింది. అమెరికా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే ఐదేళ్ల కనిష్ట స్థాయికి సోయా దిగుబడులు అక్కడ తగ్గిపోయి కేవలం 87 మిలియన్‌ టన్నులకే పరిమితమైంది.

పెరిగిన ధరలు
అమెరికాలోనే దాదాపు డెబ్బై శాతం మేర సోయా పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో ఒక్కసారిగా సోయా ధరలు పెరిగాయి. మరోవైపు మలేషియాలోనే ఇదే పరిస్థితి నెలకొంది. టన్ను పామాయిల్‌ గింజల ధర ఏకంగా 1007 డాలర్లు పెరిగింది. 2008 తర్వాత ఈ స్థాయిలో ధర పెరగడం ఇదే ప్రథమం. ఒకేసారి ఇటు సోయా, అటు పామాయిల్‌ పంట ఉత్పత్తుల ధరలు పెరగడంతో దాని ప్రభావం మన వంట నూనెపై పడింది. 

దిగుమతులపైనే ఆధారం
మన వంట నూనె అవసరాల్లో దేశీయంగా ఉత్పత్తి అవుతోంది కేవలం 35 శాతమే. మిగిలిన  65 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గరున్న విదేశీ కరెన్సీ నిల్వల్లో పెట్రోలు, బంగారం తర్వాత అథ్యధికంగా ఖర్చు చేస్తోంది వంట నూనెలకే. ఇటు అమెరికా, అటు మలేషియా, ఇండోనేషియాలలో వంట నూనె ముడి పదార్థాల ధర పెరగడంతో నాలుగైదు నెలల్లోనే వంట నూనెల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. 

తగ్గేది ఉందా ?
ప్రస్తుతం వంట నూనెలపై 35 సుంకాన్ని ప్రభుత్వం విధిస్తోంది. ఇప్పటికిప్పుడు వంటి నూనెల సెగ నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలగాలంటే ఈ పన్ను తగ్గించడం ఒక్కటే మార్గం లేదంటే. మరోసారి అమెరికా, బ్రెజిల్‌, మలేషియాలలో వంట నూనె మూల ఉత్పత్తుల దిగుబడి పెరిగే వరకు ఈ ఇబ్బందులు తప్పవు. వంట నూనెల ధరలు పెరగడంతో గత ఏప్రిల్‌లో వంట నూనె అమ్మకాలు 3 శాతం క్షీణించాయి. 
చదవండి : గల్వాన్‌ ఎఫెక్ట్‌: చైనా ఉత్పత్తులపై భారీ దెబ్బ

మరిన్ని వార్తలు