ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌, ఇండియన్‌ టెక్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌

3 Feb, 2023 11:48 IST|Sakshi

 సాక్షి, ముంబై:  గ్లోబల్‌  దిగ్గజ కంపెనీలు, సహా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోత ఆందోళనకు గురి చేస్తుండగా, దేశీయ టెక్‌ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  మంచి పనితీరు కనబర్చిన వారికి  కార్లను బహుమతిగా ఇస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన త్రిధ్య టెక్ అనే టెక్ కంపెనీ 13 మంది ఉద్యోగులకు 13 కార్లను బహుమతిగా ఇచ్చింది. ఈ కంపెనీ ఇటీవలే తొలి ఐదేళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. 

త్రిధ్యా టెక్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ మరాంద్ మాట్లాడుతూ కంపెనీ ప్రారంభించినప్పటి నుంచీ కంపెనీ ఉద్యోగులకు విశిష్ట సేవలందించారనీ,  ఆ సేవలకు గాను వారికి  కార్లు బహుమతిగా అందిస్తున్నామని తెలిపారు.  తమ ఐటీ కంపెనీని నిర్మించేందుకు  ఉద్యోగులు తమ స్థిరమైన ఉద్యోగాలను వదులుకున్నారంటూ ప్రశంసించారు. అంతేకాదు కార్లను బహుమతి ఇచ్చే ఆనవాయితీ ఇకపై కూడా కొనసాగుతుందని ఎండీ   పేర్కొన్నారు. 

ఈకామర్స్, వెబ్ ,మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్  సేవలను అందించే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ త్రిధ్య టెక్  అహ్మదాబాద్‌లో  కేంద్రంగా   ఆసియా, యూరప్  ఆస్ట్రేలియాలోని క్లయింట్‌లకు సేవలందిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం భారీ స్థాయిలో ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి.గ్లోబల్‌  ఆర్థిక మాంద్యం ముప్పు, ఆదాయాల  క్షీణత తదితరకారణాలను చూపిస్తూ  గూగుల్‌, అమెజాన్‌, మెటా,   ట్విటర్‌   ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ జనవరిలో 12,000 మందిని,  అమెజాన్ 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. టెక్ రంగం, కొన్ని నెలల వ్యవధిలో, ప్రపంచవ్యాప్తంగా 1,50,000 మంది ఉద్యోగులను తొలగించింది.
 

మరిన్ని వార్తలు