Roman Abramovich: బెడిసి కొడుతున్న పుతిన్‌తో రిలేషన్స్‌.. విలువైన ఆస్తులు వదులుకున్న రష్యన్‌ బిలియనీర్‌

3 Mar, 2022 11:45 IST|Sakshi

ప్రపంచం మొత్తం వారిస్తున్న వినకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌  ఉక్రెయిన్‌పై దాడికి దిగాడు. దీంతో అతనికి దగ్గరి వారిగా పేరొందిన అందరినీ టార్గెట్‌ చేస్తున్నాయి వెస్ట్రన్‌ కంట్రీస్‌. ముఖ్యంగా రష్యన్‌ బిలియనీర్లు పుతిన్‌తో ఉన్న సంబంధాల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. 

ఇంగ్లండ్‌ దేశంలో ఫుట్‌బాల్‌ ఆటకు ఎనలేని క్రేజ్‌ ఉంది. అక్కడ క్లబ్‌ స్థాయిల్లో జరిగే లీగ్‌లకు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ స్థాయిలో హడావుడి ఉంటుంది. ప్రతీ క్లబ్‌కి పెద​‍్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉంటారు. ఇలా ఫుల్‌ క్రేజ్‌ ఉన్న ఫుట్‌బాల్‌ క్లబ్స్‌లో చెల్సియా ఒకటి. లండన్‌లో ఈ క్లబ్‌ని 1905లో నెలకొల్పారు. ఈ క్లబ్‌ని రష్యాకి చెందిన అబ్రామోవిచ్‌ అనే బిలియనీర్‌ 2003లో కొనుగోలు చేశాడు.


అబ్రామోవిచ్‌ చేతికి వెళ్లిన తర్వాత ఈ క్లబ్‌ జాతకం మారిపోయింది. ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుంది. 19 ఏళ్ల కాలంలో అనేక లీగుల్లో సత్తా చాటింది. 19 ట్రోఫీలను గెలుచుకుంది. క్లబ్‌ను విజయ ప్రస్థానంలో నడిపించడంలో దాని ఓనర్‌ రష్యన్‌ బిలియనీర్‌ అబ్రామోవిచ్‌ మనసు పెట్టి పని చేశారు.
అయితే ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష దాడులను నాటో సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూకేలు రష్యాపై గరంగరంగా ఉన్నాయి. వరుస పెట్టి రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తు‍న్నారు. తమ దేశంలో ఉన్న రష్యన్‌ దేశస్థుల ఖాతాలను స్థంభింపజేస్తున్నారు. పలు బ్యాంకులు రష్యన్‌ సంస్థలకు సంబంధించిన లావాదేవీలు ఆపేస్తున్నాయి.

రష్యా దాడితో ఒక్కసారిగా ఆ దేశ బిలియనీర్లు జాతకం మారిపోయింది. వారి బ్యాంకు ఖాతాలు పని చేయడం లేదు. ముఖ్యంగా పుతిన్‌కి దగ్గర వాడిగా పేరున్న అబ్రామోవిచ్‌పై కఠిన చర్యలకు యూకే అథారిటీలు రెడీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో చెల్సియా క్లబ్‌ను విజయవంతంగా నడిపించడం కష్టమని అబ్రమోవిచ్‌ భావించారు. దీంతో చెల్సియా క్లబ్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. 

ఆర్థిక సమస్యలు, ఆంక్షల ప్రభావం చెల్సియాపై పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, రష్యా దాడుల ప్రభావంతో ఒక్క సారిగా పరిస్థితులు మారిపోయాయని అబ్రామోవిచ్‌ అంటున్నారు. తాజా నిర్ణయం మనసుకు ఎంతో కష్టంగా ఉన్నా తప్పడం లేదంటూ వాపోతున్నారు.

రష్యా అధ్యక్షుడికి సన్నిహంతా మెలుగుతూ ఇంత కాలం ప్రభను అనుభవించిన బిలియనీర్లు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం స్పెయిన్‌లో రష్యాకు చెందిన ఆయుధాల సరఫరా వ్యాపారికి చెందిన రూ. 59 కోట్ల విలువైన అధునాతన యాచ్‌ని అందులో పని చేసే సిబ్బంది సముద్రంలో ముంచి వేసేందుకు ప్రయత్నించారు. రష్యా దాడులకు నిరసనగా ఆ యాచ్‌ మెయింటనెన్స్‌ పనులు చూస్తున్న ఉక్రెయిన్‌ ఇంజనీరు ఈ పని చేసినట్టు దర్యాప్తులో తేలింది. మొత్తంగా రష్యన్‌ బిలియనీర్లు ప్రపంచ వ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు