Ukraine War: శాంతించిన క్రూడ్‌.. దిగొచ్చిన బంగారం!

16 Mar, 2022 08:42 IST|Sakshi

యుద్ధ ప్రభావాలపై ట్రేడర్ల తాజా సమీక్ష నేపథ్యం  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభ దశలో భారీగా పెరిగిన క్రూడ్‌ సెగలు, బంగారం మెరుపులు క్రమంగా నెమ్మదించాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ంజ్‌ (నైమెక్స్‌)లో లైట్‌ స్వీట్‌ బ్యారల్‌ ధర     మంగళవారం దాదాపు 7 శాతం (8డాలర్లకుపైగా) నష్టపోయి, 95 డాలర్లను తాకింది. ఇక బ్రెంట్‌ క్రూడ్‌ ధర కూడా ఇదే స్థాయిలో నష్టపోయి 99 డాలర్ల వద్దకు చేరింది. వారం క్రితం ఈ రెండు విభాగాల్లో ధరలు 130 డాలర్లు దాటి భారత్‌ సహా పలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై ఆంక్షలు ప్రత్యేకించి చమురు దిగుమతులపై అమెరికా విధించిన నిషేధం వంటి అంశాలు దీనికి కారణం.  

పసిడి ఇలా...
ఇక యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సురక్షిత సాధనంగా బంగారంవైపు చూడ్డంతో అంతర్జాతీయ మార్కెట్లో 2008 నాటి గరిష్ట స్థాయి 2,079 డాలర్లను చూసిన ఔన్స్‌ (31 గ్రాములు) ధర,  క్రితంకంటే 45 డాలర్లు పడిపోయి (2.3 శాతం) 1,920 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  

భారత్‌లో రూ. 2,000లకు పైగా డౌన్‌ 
దేశీయ ప్రధాన స్పాట్‌ మార్కెట్‌ ముంబైలో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు సోమవారంతో పోల్చితే మంగళవారం వరుసగా రూ.2,074, రూ.2,065 తగ్గి.. రూ.51,521, రూ.51,315 వద్ద ముగిశాయి.  దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్సేంజీ(ఎంసీఎక్స్‌)లోనూ  దిగువముఖ ధోరణి కొనసాగుతోంది.  మంగళవారం రాత్రి 10 గ్రాముల ధర దాదాపు రూ.1000 తగ్గి, రూ.51,250కి దిగివచి్చంది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఇదే దిగువ ధోరణి కొనసాగి, డాలర్‌ మారకంలో రూపాయి విలువ స్థిరంగా ఉంటే (ఫారెక్స్‌ మార్కెట్‌లో మంగళవారం 8పైసలు పడిపోయి 76.62 వద్ద ముగిసింది) బుధవారం స్పాట్‌ మార్కెట్‌లో పసిడి ధర మరింతగా రూ.1,000 వరకూ తగ్గే అవకాశం ఉంది. కాగా, వెండి కేజీ ధర ముంబై స్పాట్‌ మార్కెట్‌లో సోమవారంతో పోలి్చతే మంగళవారం ఏకంగా రూ.3,380 తగ్గి, రూ.67,200 వద్ద ముగిసింది.  

కారణాలు ఇవీ... 
► రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల వల్ల తమ ఇబ్బందులు, పర్యవసానాలు ప్రభావాలపై  ట్రేడర్లు పునఃమదింపు చేసుకోవడం ప్రారంభించారు.  

► రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొన్నప్పటికీ, కీలక అంశాలపై చర్చలకు అవి ప్రయత్నిస్తుండడం యుద్ధం ఏ క్షణమైనా ముగియవచ్చన్న సానుకూల సంకేతాలను ఇస్తోంది. ఈ పరిస్థితి ఇంధన సరఫరాలపై ఆందోళనలను ఉపశమింపజేస్తోంది. బంగారంపై పెట్టుబడుల గురించి ఇన్వెస్టర్లను పునరాలోచనలో పడేస్తోంది.  

► చైనాలో కోవిడ్‌ కేసుల విషయానికి వస్తే, రోజూ వారీ కొత్త కేస్‌లోడ్‌ గణాంకాలు మంగళవారం రెండేళ్ల గరిష్టాన్ని తాకాయి.  ప్రపంచంలోని అతిపెద్ద క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతిదారుగా ఉన్న చైనా నుంచి ఇంధన డిమాండ్‌ పడిపోతుందన్న అవుట్‌లుక్‌ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.  

► ప్రస్తుతం చమురు కొరత ఏదీ లేదని ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు  ప్రకటిస్తుండడం సరఫరాలపై ఆందోళనను తగ్గిస్తోంది.  

► ఇక భారీగా పెరిగిన ధరల నుంచి లాభాల బుకింగ్‌ కూడా జరుగుతోంది.  

► సాంకేతికంగా చూస్తే, క్రూడ్‌ తిరిగి పుంజుకోవాలంటే 104.50 డాలర్ల (20 రోజూల డీఎంఏ) స్థాయిని తిరిగి అందిపుచ్చుకోవాలి. రోజూవారీ ముగింపు 100 డాలర్ల దిగువున ఉంటే, సమీప కాలంలో బేరిష్‌ ఒత్తిడే అధికంగా ఉంటుంది.

► రష్యా–ఉక్రెయిన్‌ల చర్చలపై సానుకూల అవుట్‌లుక్‌తోపాటు, రెండు రోజుల సమావేశం అనంతరం బుధవారం (మార్చి 16వతేదీ) అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ ఫండ్‌ రేటును పావుశాతం (ప్రస్తుతం 0 నుంచి 0.25 శాతం) పెంచుతుందన్న అంచనాలు బంగారం తక్షణ బలహీనతకు కారణమవుతున్నాయి. 

చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా పడిపోతున్న ధరలు..!

మరిన్ని వార్తలు