ప్రభుత్వ ఈ-మార్కెట్‌ ప్లేస్‌పై 300కి పైగా సహకార సంఘాలు!

10 Aug, 2022 09:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్‌ (ఆన్‌లైన్‌ క్రయ, విక్రయ వేదిక/ఈ కామర్స్‌) ‘జెమ్‌’ పోర్టల్‌లో 300 వరకు కోఆపరేటివ్‌ సొసైటీలు (సహకార సంఘాలు) నమోదైనట్టు కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. జెమ్‌ పోర్టల్‌లో సంస్థల నమోదు ప్రక్రియను మంత్రి వర్చువల్‌గా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. 

అమూల్, ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, సారస్వత్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు తదితర సంస్థలు కొనుగోలుదారులుగా జెమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయని చెబుతూ.. విక్రేతలుగానూ నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు.

కోఆపరేటివ్‌ సొసైటీలు సైతం జెమ్‌ ద్వారా తమకు కావాల్సిన వస్తు, సేవలను కొనుగోలు చేసుకునేందుకు కేంద్ర కేబినెట్‌ ఈ ఏడాది జూన్‌లో అనుమతించింది. అంతకుముందు ఈ అవకాశం లేదు. తొలిదశలో రూ.100 కోట్ల టర్నోవర్‌/డిపాజిట్లు ఉన్న సొసైటీలను అనుమతించారు. దీంతో 589 సంస్థలకు అర్హత ఉందని గుర్తించగా, 300కు పైన ఇప్పటివరకు నమోదు చేసుకున్నాయి. 

మంత్రి ప్రారంభంతో.. మొదటి రోజే సుమారు రూ.25 కోట్ల విలువైన ఆర్డర్లు నమోదైనట్టు అంచనా. దేశవ్యాప్తంగా 8.5 లక్షల సహకార సంఘాలు ఉంటే, వీటి పరిధిలో 29 కోట్ల మంది భాగస్వాములుగా ఉన్నారు. జెమ్‌పై కోఆపరేటివ్‌ల నమోదు అర్హతలను మరింత సరళీకరించనున్నట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. కాగా, సహకార సంఘాల్లో సంస్కరణలు అవసరమని మంత్రి అమిత్‌షా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు