ఆస్తి అమ్మిన డబ్బుతో.. అలా వద్దండి!

12 Feb, 2024 13:27 IST|Sakshi

అన్ని జాగ్రత్తలు తీసుకుని, సంబంధిత కాగితాలు భద్రపర్చుకుని, బ్యాంకులో జమ అయిన మొత్తంతో ఏం చేయాలి అనేది ఆలోచించాలి. కాస్సేపు ఇలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని ‘ప్రతిఫలం’ అని అందాం. ఈ ప్రతిఫలం నగదు రూపంలో వద్దండి! బ్యాంకులోనే జమ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే ఈ సమాచారం వెనువెంటనే కాకపోయినా .. త్వరగా కాకపోయినా.. అంతిమంగా సబ్‌ రిజిస్ట్రార్‌కి విధించిన గడువులోగా ఇన్‌కంట్యాక్స్‌ డిపార్టుమెంటు వారికి చేరుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. 

ప్రతిఫలాన్ని ఏం చేయాలన్న ప్రశ్నకు జవాబుగా ఆదాయపు పన్ను చట్టప్రకారం మరీ ఎక్కువగా ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యుల అవసరం ఏమిటి అనే దానికే ప్రాముఖ్యత ఇచ్చి హాయిగా కాలం గడుపుతున్న కొంత మందిని ఈ వారం మీకు పరిచయం చేస్తున్నాం. 

➤ ఆ ఊళ్లో సాంబశివరావుగారు మంచి టీచర్‌. మానవతా విలువలతో పాటు విద్యావిలువలు తెలిసిన పెద్ద మనిషి. స్థిరాస్తి అమ్మకంతో వచ్చిన ప్రతిఫలంతో ఏర్పడ్డ పన్ను భారాన్ని చెల్లించేసి, మిగతా మొత్తంతో పిల్లల పేరు మీద ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేశారు. ఆ మొత్తాన్ని వారి వారి చదువులకు ఖర్చు పెట్టి వారిని వృద్ధిలోకి తీసుకొచ్చారు. అందరూ భారత్‌లోనే ఉన్నారు.  

➤ పిల్లలను విదేశాల్లో చదివించాలన్న విశ్వేశ్వరరావు కూడా అదే బాటని ఆశ్రయించారు. పన్ను భారం చెల్లించాక మిగిలిన మొత్తంతో కొడుకుని విదేశాల్లో ఉన్నత విద్యల కోసం పంపించి హాయిగా ఉన్నారు.  

➤ చెల్లి పెళ్లి అప్పులతో తండ్రి చేశాడు. క్రమేణా కాలం కలిసొచ్చింది కల్యాణరావుకి. మావగారు ఇచ్చిన ఇల్లుకి రింగ్‌ రోడ్‌ ధర్మమా అని రేటు రాగానే అమ్మేశాడు, పన్ను కట్టాకా మిగిలిన మొత్తంతో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళి చేసేసి, మనవళ్ళతో ఆడుకుంటున్నాడు. 

➤ శివరావుగారి తాతగారు ఎప్పుడో గుడి కట్టించారు. అది శిథిలం అయ్యింది. తండ్రి ఏమి చేయలేకపోయాడు. కానీ గుడిని పునరుద్ధరించాలనేది ఆయన చిరకాల కోరిక. శివరావుగారు తనకు వచ్చిన ‘ప్రతిఫలం’లో మిగిలిన మొత్తంతో గుడిని బాగుచేయించారు. తన శ్రమ శక్తి వల్ల ఏర్పడ్డ స్థిరాస్తి అమ్మకం.. శివభక్తికి అలా ఉపకరించింది. భార్య పార్వతమ్మ సంతోషం అంతా ఇంతా కాదు. 

➤ తన స్కూలు చదువంతా ఎండా, వానల్లోనే. కాలేజీకి వచ్చే వరకు బెంచీలు చూడని విద్యాధరరావు డబ్బు సంపాదించి, ఇల్లు కొన్నాడు. అమ్మవలసినప్పుడు, అన్ని బాధ్యతలను తీర్చివేసి ఊళ్లో స్కూల్లో అన్ని తరగతులవారికి బెంచీలు కొన్నాడు. 

➤ బంగార్రాజు పేరుకే బంగార్రాజు. పెళ్లాం లక్ష్మీ ప్రతిరోజూ పేచీయే బంగారం కొనమని. అనుకోకుండా అన్నదమ్ముల స్థిరాస్తి పంపకాల్లో ఆస్తి అమ్మాల్సి వచ్చింది. పన్ను కట్టేసి మిగిలిన మొత్తంతో పెళ్లాం లక్ష్మమ్మని ఏడువారాల నగలు, వడ్డాణం కొని ‘లక్ష్మీదేవి’గా చేశాడు బంగార్రాజు. 

➤ అమీర్‌పేటలో ఇరుకు ఇంట్లో నలభై ఏళ్లు కాపురం చేసి విసిగిపోయిన రాజారావు.. ’ప్రతిఫలం’తో ఓ విల్లా కొనుక్కుని, నార్సింగిలో సరదాగా ఉన్నాడు. పన్ను మినహాయింపులు కూడా పొందాడు. 

➤ మొదటి నుంచి ఫైనాన్షియల్‌ డిసిప్లిన్‌ ఉండటం వల్ల ’ప్రతిఫలం’ మొత్తాన్ని నిర్దేశిత బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసి, ఆ వడ్డీలతో ఏ అప్పు లేకుండా పబ్బం గడుపుతున్నాడు ’లక్ష్మీపతి’. 

➤ పాత ఇండస్ట్రీ షెడ్డుని అమ్మేసి, ఆ డబ్బుతో కొత్త షెడ్డు కొని వ్యాపారం చేస్తున్నారు నాయుడుగారు. 

➤ అన్ని ఆస్తులు అమ్మినా, సరైన ప్లానింగ్‌ లేకుండా అప్పుల పాలైన అప్పారావూ ఉన్నారు. 

ఏదేమైనా ‘ప్రతిఫలం’ మొత్తాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ఆలోచించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి.  

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌ పంపించగలరు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega