Anand Mahindra: ఎల్లలు దాటిన తెలుగోడి ఖ్యాతి.. ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

24 Mar, 2022 15:37 IST|Sakshi

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వడ్రంగి కడిపు శ్రీనివాస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాడు. కరెంటుతో అవసరం లేకుండా అతను రూపొందించిన ట్రెడ్‌మిల్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎలాంగి హంగు ఆర్భాటాలు లేకుండా అతను రూపొందించిన వుడ్‌ ట్రెడ్‌మిల్‌ని ఇప్పటికే కేటీఆర్‌, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు మెచ్చుకోగా ఇప్పుడా జాబితాలో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రా చేరారు. 

దేశం మారుమూలలో ఎక్కడ టాలెంట్‌ ఉన్న సరే తన దృష్టికి వస్తే చాలు నాలుగు మంచి మాటలు చెప్పడానికి, తన వంతు సాయం అందించేందుకు ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మార్కెట్‌లో అనేక వస్తువులు అందుబాటులో ఉన్నా అందులో అధిక శాతం కరెంటు ఆధారంగా పని చేసేవే ఉన్నాయి. కానీ ఈ చేతివృత్తి నిపుణుడు రూపొందించిన ట్రెడ్‌మిల్‌ అందుకు విరుద్ధం. నిజానికి దీన్ని వుడ్‌ ట్రెడ్‌మిల్‌ అనే కంటే ఓ నిపుణుడు సృష్టించిన కళారూపంగా చూడాలి అంటూ పేర్కొన్నారు. అంతేకాదు నాకు ఈ కళాఖండం కావాలంటూ ట్విట్టర్‌ వేదికగా కోరారు ఆనంద్‌ మహీంద్రా.

ఆనంద్‌ మహీంద్రా ఇలా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడో లేదో నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే వేల కొద్ది లైకులు, వందల కొద్ది రీట్వీట్లు వచ్చి పడ్డాయి. కడిపు శ్రీనివాస్‌ రూపొందించిన వుడ్‌ ట్రెడ్‌మిల్‌కి పేటెంట్‌ ఇప్పించాలని కొందరు, అతని ప్రొడక్టును భారీగా తయారు చేసేందుకు సాయం చేయాలంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. కానీ నూటికి తొంభై శాతం మంది భారత్‌లో మరుగునపడి ఉన్న ప్రతిభకు కడిపు శ్రీనివాస్‌ ఓ ఉదాహారణ చెబుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు