‘వండర్‌ఫుల్‌ కేటీఆర్‌’.. ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

11 Sep, 2021 08:27 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతున్న మంత్రి కేటీఆర్‌ దేశవ్యాప్తంగా ప్రముఖులను ఆకట్టుకుంటున్నారు. నిన్న ఐటీ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ తరఫున బెంగాల్‌ ఎంపీ మహువా మెయిత్రా కేటీఆర్‌ను అభినందించగా తాజాగా ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా మంత్రి కేటీఆర్‌ను మెచ్చుకున్నారు. 

గొడుగు పట్టిన మంత్రి
టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించారు. నగరంలోని సెయింట్‌ థెరిస్సా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటును ప్రారంభించడంతో పాటు ఏటూరునాగారం ఆస్పత్రికి అంబులెన్సును టెక్‌ మహీంద్రా తరఫున అందించారు. అయితే కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ సీపీ గుర్నానీ తడవకుండా గొడుగు పట్టారు. 

గుర్నానీ ట్వీట్‌
తాజాగా మంత్రి కేటీఆర్‌ తనకు గొడుకు పట్టిన ఫోటోను ట్విట్టర్‌లో గుర్నానీ షేర్‌ చేశారు. ‘మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో బాగుంది కేటీఆర్. మీరు మనస్ఫూర్తిగా వ్యవహరించిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అసలు, మీ స్థాయి వ్యక్తి నాకు గొడుగు పట్టడం అనేది ఎంతో అరుదైన విషయం... ఇది ప్రతి రోజు జరిగే పని కాదు. అందుకు నా కృతజ్ఞతలు’ అంటూ గుర్నానీ కామెంట్‌ చేశారు.

ఆనంద్‌ మహీంద్రా స్పందన
టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ‘వండర్‌ఫుల్‌ కేటీఆర్‌. నాయకత్వం, వినయం అనేవి విడదీయరాని అంశాలను అనడానికి మీరొక అసాధారణమైన ఉదాహారణగా నిలిచారు’ అంటూ కామెంట్‌ చేశారు.  

థ్యాంకు ఆనంద్‌ మహీంద్రా
ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌కి మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కైండ్‌ వర్డ్స్‌ @ఆనంద్‌మహీంద్రా జీ అంటూ నమస్కారం పెట్టే ఎమోజీని పోస్ట్‌ చేశారు. 
చదవండి: టీ హబ్‌కి ఎంపీలు ఫిదా.. మంత్రి కేటీఆర్‌ని మెచ్చుకున్న ఫ్రైర్‌బ్రాండ్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు