Anand Mahindra: అబ్దుల్‌ కలాం మాటలే మాలో ధైర్యాన్ని నింపాయి

31 May, 2022 18:13 IST|Sakshi

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్ స్ఫూర్తితోనే కఠిన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని తిరిగి సరైన మార్గంలోకి రాగలిగామంటూ గతాన్ని నెమరు వేసుకున్నారు ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా. మిన్నువిరిగి మీద పడిన ఆ సందర్భంలో కేవలం అబ్దుల్‌ కలామ్‌ చెప్పిన మాటలే తమలో ధైర్యాన్ని నింపాయన్నారు ఆనంద్‌ మహీంద్రా. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విటర్‌లో ఆయన షేర్‌ చేశారు. 

మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు షేర్ల ధర 2019లో భారీగా పడిపోయింది. ఆల్‌టైం హై రూ.984 నుంచి నేలకు దిగి వచ్చింది. కంపెనీ వ్యక్తులుగా మా అందరికీ ఆ ఘటన షాక్‌ కలిగించింది. అయితే అదే ఏడాది జరిగిన యాన్యువల్‌ లీడర్‌షిప్‌ కాన్ఫరెన్స్‌లో మా కంపెనీ ఉద్యోగులకు దిశానిర్ధేశం చేయాల్సి వచ్చింది. అప్పుడు మహనీయుడు అబ్దుల్‌ కలామ్‌ మాటాలనే ప్రస్తావిస్తూ వారిలో స్ఫూర్తిని నింపానంటూ ఆనంద్‌ మహీంద్రా తెలిపారు.

అంతకు ముందు మహీంద్రా వ్యాలీ ప్రారంభోత్సవానికి వచ్చిన అబ​‍్దుల్‌ కలామ్‌  మాట్లాడుతూ డేర్‌ టూ డ్రీమ్‌ అంటూ సలహా ఇచ్చారు. కలామ్‌ మాటలనే మరోసారి ఉద్యోగులకు వివరించానంటూ ఆనంద్‌ మహీంద్రా ఆనాటి ఘటన గుర్తు చేసుకున్నారు. మనందరం కష్టపడి పని చేస్తే మహీంద్రా గ్రూపు 75వ వార్షికోత్సవం నాటికి మరోసారి ఆల్‌టైం హైకి షేరు ధర చేరుకోవడం కష్టం కాదంటూ వారిలో నమ్మకం నింపేందుకు ప్రయత్నించినట్టు ఆయన వెల్లడించారు. 

అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టు 75వ వార్షికోత్సం నాటికి ఆల్‌టైం హై రూ.984కి షేరు ధర తీసుకెళ్లలేకపోయామని ఆనంద్‌ మహీంద్రా అన్నారు. కానీ సరిగ్గా ఏడాది తిగిరే సరికి ఆల్‌టైం హైని దాటేసినట్టు తెలిపారు.  కలాం డేర్‌ టూ డ్రీమ్‌ మాటలను నిజం చేస్తూ కొత్త ఆల్‌టైం హైకి షేరు ధర రూ.1000కి చేరుకుందన్నారు. మరోసారి ఈ ఘనత సాధించిన తన టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు మహీంద్రా. 
 

చదవండి: భారతి ‘స్వరాజ్‌’’పై ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు