Anand Mahindra: ప్రాణం కంటే ఛాలెంజ్‌లు పెద్దవేమీ కాదు! కరోనాతో జాగ్రత్త.. ఆనంద్‌ మహీంద్రా సలహా

22 Jan, 2022 11:03 IST|Sakshi

CoronaVirus: ఓమిక్రాన్‌ కేసులు దేశాన్ని చుట్టుముడుతున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. క్రమంగా దేశం కఠిన ఆంక్షల వైపుకు వెళ్తోంది. ఈ తరుణంలో దేశ ప్రజలకు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సలహా ఇచ్చారు ఆనంద్‌ మహీంద్రా. ఇటీవల జరిగిన ఓ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ట్వీట్‌ చేస్తూ ఈ సలహా ఇచ్చారు. 

టీకా వద్దు
చెక్‌ దేశానికి చెందిన ప్రముఖ జానపద గాయని హనా హోర్కా ఇటీవల మరణించారు. ఆమెకు భర్త ఒక కొడుకు ఉన్నారు. మరణించే వరకు ఆమె వ్యాక్సినేషన్‌ వద్దు అనే ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. కరోనాకు విరుడుగా వ్యాక్సినేషన్‌ వద్దని శరీరంలో సహాజ సిద్ధంగా వృద్ధి చెందే రోగ నిరోధకత శక్తియే మేలు అంటూ తరచుగా చెప్పేవారు. ఆమె భర్త, కొడుకు వ్యాక్సిన్‌ తీసుకున్నా హనా హోర్కా మాత్రం టీకాకు దూరంగా ఉన్నారు.

కరోనా రావాలంటూ..
శరీరంలో ఉండే సహాజ రోగ నిరోధక శక్తి ప్రభావం అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో హనా హోర్కా ఏరికోరి కరోనా తెచ్చుకున్నారు. చనిపోవడానికి రెండు రోజుల ముందు సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ.. తనకు కరోనా వచ్చిందని, టీకా తీసుకోకపోయినా తాను దాన్ని జయించబోతున్నట్టుగా మాట్లాడారు. కానీ ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మరణించారు. బయటి వ్యక్తుల ప్రభావానికి లోనవడం వల్లే తన తల్లి టీకా తీసుకోకుండా ప్రాణాలు కోల్పోయిందటూ ఆమె కొడుకు రెక్‌ తెలిపాడు. 

ఇలాంటివి వద్దు
హనాహోర్కా ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ప్రమాదకర ఛాలెంజ్‌ల జోలికి వెళ్లొద్దంటూ సూచించారు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు వస్తున్నా.. ఆస్పత్రి పాలు అవుతున్నవారు, చనిపోతున్న వారు మన దగ్గర తక్కువగా ఉన్నారు. టీకా కార్యక్రమం ముమ్మరంగా చేపట్టడం ఎక్కువ మంది వ్యాక్సిన్‌ వేయించుకోవడమే ఇందుకు కారణమని వైద్య వర్గాలు అంటున్నాయి. 

మరిన్ని వార్తలు