బిట్‌కాయిన్‌తో మహీంద్రా కార్లు కొనొచ్చా? ఆనంద్ మహీంద్రా సమాధానం ఏంటంటే..?

23 Apr, 2023 15:24 IST|Sakshi

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు మంచి పేరుంది. ఇప్పటికే మహీంద్రా XUV300, స్కార్పియో, బోలెరో, థార్ వంటి కార్లను విక్రయిస్తూ అత్యధిక ప్రజాదరణ పొందుతోంది. అయితే ఇటీవల ఒక ట్విట్టర్ యూజర్‌ బిట్‌కాయిన్‌తో మహీంద్రా కార్లను కొనవచ్చా అంటూ ప్రశ్నించారు. దీనికి స్వయంగా ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం ఏంటి? భవిష్యత్తులో బిట్‌కాయిన్‌ ద్వారా కంపెనీ కార్లను కొనొచ్చా.. లేదా? అనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా అప్పుడప్పుడు ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేయడమే కాకుండా, కొంత మంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక వ్యక్తి బిట్‌కాయిన్‌తో మహీంద్రా కార్లు కొనొచ్చా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతానికి అలాంటి అవకాశం లేదు, కానీ భవిష్యత్తులో కొనొచ్చు అన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ChatGPT: ప్రపంచ దేశాలు పొగిడేస్తున్నాయ్.. స్టూడెంట్స్‌తో పోటీపడలేకపోతోంది)

ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానంతో రాబోయే రోజుల్లో మహీంద్రా కార్లను కొనేయొచ్చని తెలుస్తోంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. క్రిప్టో కరెన్సీలో బిట్‌కాయిన్‌ అనేది చాలా పవర్ ఫుల్‌. ప్రపంచంలోని చాలా దేశాలు వీటి ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. అయితే భారతదేశంలో ఈ క్రిప్టో కరెన్సీ అనేది లీగల్‌ కాదు. 

భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని లీగల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మహీంద్రా కంపెనీ బిట్‌కాయిన్‌తో లావాదేవీలకు అనుమతిస్తే దేశంలో బిట్‌కాయిన్‌ ద్వారా కార్లు విక్రయించిన మొదటి కంపెనీగా చరిత్రకెక్కుతుంది. బిట్‌కాయిన్‌తో కార్లను విక్రయించడం మొదలుపెడితే ఎంతమంది ఈ పద్దతి ద్వారా కొనుగోలు చేస్తారనేది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది.

మరిన్ని వార్తలు