నా తండ్రి ధైర్యాన్ని చూస్తే గర్వంగా ఉంది - ఆనంద్‌ మహీంద్రా

7 Jun, 2022 09:21 IST|Sakshi

దాదాపు 75 ఏళ్ల పాటు రహస్య సమచారంగా ఉన్నటువంటి ఓ విషయాన్ని ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా దేశ ప్రజలతో షేర్‌ చేసుకున్నారు. స్వాతంత్రానికి పూర్వం బ్రిటీష్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిని దుయ్యబడుతూ తన తండ్రి రాసిన వివరాలను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ ద్వారా తెలిపారు. 

అమెరికాలోని మసాచుసెట్స్‌కి చెందిన ప్రముఖ పాఠశాల ఫ్లెచర్‌. ఇటీవల ఈ స్కూల్‌ యాజమాన్యం తమ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆనంద్‌ మహీంద్రాకి ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా గతంలో ఆనంద్‌ మహీంద్రా తండ్రి ఈ పాఠశాలలో చదివినప్పుడు (1945) తన భవిష్యత్తు లక్ష్యాలను వివరిస్తూ స్కూల్‌ యాజమాన్యానికి రాత పూర్వకంగా తెలిపిన అభిప్రాయాలను ఆనంద్ మహీంద్రాకు అప్పగించింది. ఆ లేఖలో విషయాలను చూసిన ఆనంద్‌ మహీంద్రా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 

ఫ్లెచర్‌ స్కూల్‌ యజమాన్యానికి రాసిన లేఖలో బ్రిటీష్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద విదేశాంగ విధానం దాని పర్యవసానంగా భారత్‌కి జరుగుతున్న నష్టాలను ఆనంద్‌ మహీంద్రా తండ్రి అందులో సోదాహారంగా వివరించారు. ఇండియాకు ఇప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానం లేదంటూ అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా వాస్తవాలను విశ్లేషించారు. భవిష్యత్తులో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రయోజనాలు లక్ష్యంగా స్వతంత్ర ఫారిన్‌ పాలసీ ఇండియాకి అవసరం అంటూ ఆనంద్‌ మహీంద్రా తండ్రి స్పష్టం చేశారు. అందువల్లే తాను ఫారిన్‌ సర్వీస్‌ను ఎంపిక చేసుకుంటానని తన భవిష్యత్‌ ప్రణాళిక ఏంటో తెలిపారు. తన లాంటి మరెందరికో అంతర్జాతీయ వ్యవహారాల్లో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ తెలిపారు. 

స్వాతంత్రానికి పూర్వమే బ్రిటీష్‌ రాజ్‌లో జీవిస్తూ.. అప్పటి తెల్లదొరల దమననీతిని ఎండ గడుతూ తన తండ్రి చూపిన తెగువను ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. మన తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడే వారితో  ఎక్కువగా మాట​​​‍్లాడుతూ.. వారికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలంటూ నేటి యువతకు ఆయన సూచించారు. 

చదవండి: హైదరాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం, ఆనంద్‌ మహీంద్రా ఆగ్రహం!

మరిన్ని వార్తలు