8 ప్లాస్టిక్ కవర్లు 4 పెట్ బాటిల్స్‌ ఒక జత షూ.. ఆనంద్‌ మహీంద్రాని ఆకట్టుకున్న స్టార్టప్‌

17 Nov, 2021 12:33 IST|Sakshi

Ashay Bhave Who made Thealy Brand shoes from Plastc covers and bottles: ప్లాస్టిక్‌ పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్‌ని నివారిద్దాం అనే స్లోగన్లు ఎన్నిసార్లు వింటున్న వాటి వాడకం ఆపడం లేదు. కానీ ఢిల్లీకి చెందిన ఈ 23 ఏళ్ల కుర్రాడు మాటలు కట్టి పెట్టి చేతల్లోకి దిగాడు. ఇంత గొప్ప ఐడియాను అమలు చేస్తున్న వ్యక్తి గురించి నేనింకా ఎందుకు తెలుసుకోలేకపోయానంటూ సాక్షత్తూ ఆనంద్‌ మహీంద్రాలాంటి బిజినెస్‌ టైకూన్‌ బాధపడేంతంగా ఫలితాలు సాధిస్తున్నాడు.

ఆశయ్‌ భావే నెలకొల్పిన స్టార్టప్‌ కంపెనీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. పాలబుగ్గల పసివాడిగా కనిపస్తున​ ఓ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ విద్యార్థి నెలకొల్పిన కుటీర పరిశ్రమ వందల మందికి ఉపాధిని ఇస్తోంటే లక్షల మందిని ఆలోచనలో పడేసింది.


స్టార్టప్‌ ఐడియా
ప్లాస్టిక్‌ నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు అంతంతగానే ఉంటున్నాయి. ప్రతీ ఊరిలో ప్రతీ విధీలో చెత్త కుప్పల నిండా ప్లాస్టిక్‌ కవర్లు, పెట్‌ బాటిల్స్‌ ఆక్రమించేస్తున్నాయి. డ్రైనేజీలకు అడ్డం పడుతున్నాయి. ఇలాంటి చెత్త నుంచి ఓ అద్భుతమైన పరిశ్రమకు ఊపిరి పోశాడు ఢిల్లీకి చెందిన ఆశయ్‌ భావే. చెత్తకుప్పల్లో పడేసిన ప్లాస్టిక్‌ కవర్లు, పెట్‌బాటిల్స్‌తో ప్రొఫెషనల్‌ షూ తయారీ కంపెనీని ఏర్పాటు చేశాడు. వాటిని ఆన్‌లైన్‌ వేదికగా టిక్‌టాక్‌గా అమ్మేస్తున్నాడు.

ఢిల్లీ టూ గురుగ్రామ్‌
చెత్త సేకరించే ఏజెన్సీలతో మొదట ఒప్పందం చేసుకున్నాడు ఆశయ్‌.ఢిల్లీ నగర వ్యాప్తంగా ఉన్న రాగ్‌పికర్స్‌ (చెత్త ఏరుకునే వాళ్లు)కి ప్లాస్టిక్‌ కవర్లు, పెట్‌ బాటిల్స్‌ తీసుకురావాలంటూ ఏజెన్సీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అంతే వారం రోజుల వ్యవధిలోనే టన్నుల కొద్ది చెత్త సేకరించేందుకు గురుగ్రామ్‌లో ఓ యూనిట్‌ ఏర్పాటు చేశారు. నలుదిశల నుంచి వచ్చి పడిన ప్లాస్టిక్‌ కవర్లు, పెట్‌ బాటిల్స్‌ని శుభ్రంగా నీటితో కడిగి తేమ పోయే వరకు ఆరపెడతారు. ఆ తర్వాత ప్లాస్టిక్‌ కవర్లను ఒకదాని మీద ఒకటిగా ఎనిమిది లేయర్లుగా పేర్చుతారు. కావాల్సిన డిజైన్‌లో కట్‌ చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పద్దతిలో దాన్ని వేడి చేసి.. షూ తయారీకి అవసరమైన తేలే టెక్ట్స్‌ అనే రా మెటీరియల్‌గా మారుస్తారు.


ఢిల్లీ టూ జలంధర్‌
గురగ్రామ్‌ ఫ్యాక్టరీలో తయారైన షూ మెటీరియల్‌ని పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న షూ తయారీ యూనిట్‌కి పంపిస్తారు. అక్కడ ఈ మెటీరియల్‌తో స్నీకర్‌ షూకి తగ్గట్టుగా కట్‌ అండ్‌ స్టిచ్‌ వర్క్‌ జరుగుతుంది. ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ రబ్బరు నుంచి తయారు సోల్‌ని ఉయోగించి షూని రెడీ చేస్తారు. షూకి సంబంధించిన లేస్‌, ప్యాకింగ్‌కు ఉపయోగించే కవర్లు సైతం పూర్తిగా ప్లాస్టిక్‌ వేస్ట్‌ మెటీరియల్‌తో హ్యాండ్‌ మేడ్‌గా తయారు చేస్తారు.


బ్రాండ్‌ తేలే 
ప్లాస్టిక్‌ నుంచి తయారు చేస్తున్నా.. క్వాలిటీలో కాంప్రమైజ్‌ కాలేదు. అందువల్లే ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా బ్రాండింగ్‌ , మార్కెటింగ్‌ చేస్తున్నారను. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి తయారు చేసిన షూస్‌ని తేలే బ్రాండ్‌ పేరుతో మార్కెట్‌ చేస్తున్నారు. దీని కోసం thaely.com అనే వెబ్‌సైట్‌ని అందుబాటులో ఉంచారు. తేలే బ్రాండ్‌లో వివిధ మోడళ్ల షూస్‌ ధర 110 యూఎస్‌ డాలర్లకు అటు ఇటుగా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేసి షూస్‌ పొందవచ్చు. డెలివరీ అందగానే షూ ప్యాక్‌ చేసిన కవర్‌ని భూమిలో పాతితే పది రోజుల్లో ఓ తులసి మొక్క మొలిచేలా బ్యాగ్‌ని రూపొందించారు.


అదిరిపోయే సేల్స్‌
ఆశయ్‌ భావే తేలే షూ తయారీని 2021 జులైలో ప్రారంభించారు. ప్రస్తుతం వారానికి 15 వేల జతల షూస్‌ ఇక్కడ తయారవుతున్నాయి. మొదటి వారం 300 షూలు తయారు చేయగా ఇప్పుడా సంఖ్య 15 వేలకు చేరుకుంది. రెడీ అయిన షూ రెడీ అయినట్టే అమ్ముడైపోతుంది. జలంధర్‌, గురుగ్రామ్‌లో ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగుల సంఖ్య 170కి చేరుకుంది. ఢిల్లీ నగరంలో ఉన్న రాగ్‌ పికర్స్‌కి ఆదాయం పెరిగింది. చెత్త కుప్పల్లో ప్లాస్టిక్‌ బాటిల్స్‌, కవర్లు క్రమంగా కనుమరుగు అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి.


సిగ్గుపడుతున్నా
ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి షూ తయారు చేస్తున్న ఆశయ్‌ భావే సక్సెస్‌ స్టోరి ఇటీవల ప్రసారం అయ్యింది. అది చూసిన వెంటనే ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ఇలాంటి స్టార్టప్‌ గురించి ఇంత కాలం తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నాను. ఈ రోజే నేను ఓ జత షూ కొనుక్కుంటాను అంటూ చెప్పుకొచ్చారు. తన ట్విట్టర్‌ పేజీలో సక్సెస్‌ స్టోరీని షేర్‌ చేశారు. 

ప్రపంచ వ్యాప్తంగా
ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి షూస్‌ని ప్రముఖ కంపెనీలు కూడా గతేడాది నుంచి తయారు చేస్తున్నాయి. 2020 జూన్‌ నుంచి స్పేస్‌ హైవే సిరీస్‌తో నైక్‌ సంస్థ ప్రత్యేకంగా మార్కెట్‌లోకి షూస్‌ని తెచ్చింది.  సముద్రంలో పోగుపడిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అడిడాస్‌ సంస్థ షూస్‌ తయారు చేస్తోంది. ఈ రెండు బ్రాండ్ల నుంచి ఇప్పటి వరకు కోటి జతలకు పైగా షూస్‌ ప్రపంచ వ్యాప్తంగా విక్రయించారు. 

- సాక్షివెబ్‌, ప్రత్యేకం

చదవండి:బిల్‌గేట్స్‌ పేరెత్తితే ఆనంద్‌ మహీంద్రాకి చిరాకు.. కారణం ఇదే?

మరిన్ని వార్తలు