Anand Mahindra: ఐరన్‌ మ్యాన్‌ కలను నిజం చేసిన ఆనంద్‌ మహీంద్రా

17 Nov, 2021 19:50 IST|Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల విజయాల గురించి ప్రత్యేక కథనాలను తన ట్విట్టర్ వేదికగా పంచుకునే విషయం మనకు తేలిసిందే. కొన్నిసార్లు, అతను ప్రతిభ ఉన్న వారి గుర్తించి ప్రోత్సహించడంలో ముందుంటారు. గ్రామీణ యువతీయువకుల్లో ఉండే ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ఆనంద్‌ మహీంద్రా ముందుకు వస్తారు. తాజాగా నేడు గతంలో ఒక కుర్రాడికి ఇచ్చిన మాటను మహీంద్రా నిలబెట్టుకున్నారు. 

మణిపూర్‌ రాష్ట్రం థౌబల్‌ జిల్లా హెయిరోక్‌ గ్రామానికి చెందిన నింగోంబమ్‌ ప్రేమ్‌.. చెత్త కుప్పల వెంట దొరికే ఎలక్ట్రానిక్ వేస్టేజ్‌ను సేకరించి కార్డ్‌బోర్డ్‌ సాయంతో ఐదేళ్లు కష్టపడి ఐరన్‌మ్యాన్‌ సూట్‌ని తయారు చేశాడు. ఈ సూట్‌తో పాటు మధ్య మధ్యలో కొన్ని ఆవిష్కరణలు చేశాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో చెల్లిని సైతం చదివిస్తున్నాడు. అతనికి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చేయాలని ఉందట. కానీ, డబ్బుల్లేక ఆగిపోయాడు. ఈ విషయం ఓ వీడియో ద్వారా వ్యాపారదిగ్గజం ఆనంద్‌ మహీంద్రాకు చేరింది. టోనీ స్టార్క్‌ (మార్వెల్‌ ఐరన్‌మ్యాన్‌)ను పక్కకి తప్పుకోమంటూ.. ప్రేమ్‌ను రియల్‌ ఐరన్‌ మ్యాన్‌గా పొడిగారు ఆనంద్‌ మహీంద్రా.  అంతేకాదు అతనికి, అతని సోదరికి సాయం అందిస్తానని మాటిచ్చారు. 

ఇప్పుడు ప్రేమ్‌కు ఇచ్చిన మాటను నిజం చేస్తూ హైదరాబాద్‌లోని మహీంద్రా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించారు. ఈ విషయాన్ని ఆనంద్‌ మహీంద్రా స్వయంగా ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. "ఇంఫాల్ కు చెందిన మా యువ భారతీయ ఐరన్ మాన్ ప్రేమ్ గుర్తున్నాడా? అతను కోరుకున్న ఇంజనీరింగ్ విద్యను పొందడానికి అతనికి సహాయం చేస్తానని మేము వాగ్దానం చేస్తున్నాము. అతను హైదరాబాద్‌లోని @MahindraUni మహీంద్రా విశ్వవిద్యాలయం వచ్చిన విషయాన్ని పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. అలాగే ప్రేమ్‌ ప్రయాణానికి సహకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు" ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు