కేటీఆర్‌ కనుక కెమెరా ముందుకు వస్తే టాలీవుడ్ చూస్తూ ఊరుకుంటుందా!?

22 Jun, 2022 20:47 IST|Sakshi

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కనుక కెమెరా ముందుకు వస్తే టాలీవుడ్‌ చూస్తూ ఊరుకోదని ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా అన్నారు. తిరుగులేని బ్రాండ్‌ అంబాసిడర్‌ కేటీఆరే అంటూ ఆయన పొగడ్తలు కురిపించారు. ఈ ఆసక్తికర సంభాషణ ట్విటర్‌ వేదికగా ఇరువురి మధ్య చోటు చేసుకుంది.

తెలంగాణలోని జహీరాబాద్‌లో మహీంద్రా ట్రాక్టర్ల తయారీ పరిశ్రమ ఉంది. ఇందులో బుధవారం రోజు మూడు లక్షల ఒకటవ (3,00,001) ట్రాక్టర్‌ ఉత్పత్తి జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ట్రాక్టర్ల తయారీ యూనిట్‌ను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు కేటీఆర్‌. ఈ సందర్భంగా... మహీంద్రాజీ మీరు కనుక మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్‌ చేసేందుకు నేను రెడీ. అందు కోసం మీ ట్రాక్టర్ల ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిస్తా అంటూ కేటీఆర్‌ అన్నారు.

కేటీఆర్‌ నుంచి ట్వీట్‌ రావడం ఆలస్యం వెంటనే ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. కేటీఆర్‌, మీరు తిరుగులేని బ్రాండ్‌ అంబాసిడర్‌ అనడంలో నాకు ఎలాంటి సందేహాం లేదు. అంతేకాదు మీరు కనుక కెమెరా ముందుకు వస్తే కనుక రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న టాలీవుడ్‌ చూస్తూ ఊరుకోదని, మిమ్మల్ని తనవైపు లాగేసుకుంటుందంటూ ఆనంద్‌ మహీంద్రా చమత్కరించారు. 

సార్‌.. నేనే దొరికానా?

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై కేటీఆర్‌ రియాక్టయ్యారు. సార్‌.. మీరు ఆడుకోవడానికి నేనే దొరికానా అనే అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్‌ చేస్తూ స్మైలీ ఎమోజీతో కలిపి పోస్ట్‌ చేశారు.

చదవండి: ఆనంద్‌ మహీంద్రా సందేశం.. పనంతా నువ్వొక్కడివే చేయకు!

మరిన్ని వార్తలు