ఓలా ఎలక్ట్రిక్ ని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా

18 Jul, 2021 15:42 IST|Sakshi

త్వరలో లాంచ్ కానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ-బుకింగ్ విషయంలో వచ్చిన అద్భుతమైన స్పందన చూసి మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా భవిష్ ఓలా ఎలక్ట్రిక్ పై ప్రశంసలు కురిపించారు. బుకింగ్ ప్రారంభించిన 24 గంటల్లో ఓలా-స్కూటర్ కోసం లక్ష మందికి పైగా ప్రీ-బుకింగ్ చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. 24 గంటల్లో లక్ష మందికి పైగా ప్రీ-బుకింగ్ చేసుకోవడంతో ఓలా ఛైర్మన్, గ్రూప్ సీఈఓ భవిష్ అగర్వాల్ ను ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రశంసించారు. మరింత మంది వ్యవస్థాపకులు అగర్వాల్ ని అనుసరించాలని, వైఫల్యానికి భయపడకూడదని, భారతీయులు మరింత దృఢంగా సరికొత్త ఆవిష్కరణలను చేపట్టాలని పారిశ్రామికవేత్త తెలిపారు. 

ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ కు భవిష్ అగర్వాల్ బదులిచ్చారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో బుకింగ్ లు ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనే లక్షకు పైగా రిజర్వేషన్లను పొందింది. ఇది ప్రపంచంలోనే తక్కువ సమయంలో అత్యదిక మంది ప్రీ బుక్ చేసుకున్న స్కూటర్ అని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ-స్కూటర్ కోసం బుకింగ్స్ జూలై 15 సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్ తన వెబ్ సైట్ లో స్కూటర్ ప్రీ బుక్ చేసుకోవడం కోసం రూ.499లను చెల్లించాలని పేర్కొంది. ఈ డబ్బులు రీఫండ్ కూడా చేయనున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు