పేద కమ్మరికి బొలెరో ఆఫర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా! ప్రతిగా ఏం కోరాడంటే..

22 Dec, 2021 17:50 IST|Sakshi

Anand Mahindra Offers Bolero To This Man Who Made four wheeler With Scrap: మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చర్యలు ఎప్పుడూ ఆకట్టుకునేలా ఉంటాయి. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బిజినెస్‌ టైకూన్‌.. అప్పుడప్పుడు సర్‌ప్రైజ్‌లు కూడా ఇస్తుంటాడు. అలా ఇప్పుడు ఓ సామాన్యుడికి బంపరాఫర్‌ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. 

ఇంతకీ మహీంద్రా ఆఫర్‌ ఇచ్చింది  ఓ పేదకమ్మరికి!. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్‌ వీలర్‌ను తయారుచేశాడతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా అయిపోయారు. అందుకే ఆ వీడియోను షేర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో ఆ కారు ఎలా పని చేస్తుందో కూడా వివరంగా ఉంది. పనిలో పనిగా ఆ వ్యక్తి తయారు చేసిన వాహనం తీసుకుని.. తన కంపెనీ తరపున బొలెరో వాహనాన్ని ఇవ్వాలని ఫిక్సయ్యారు ఆనంద్‌ మహీంద్రా.  
 

‘‘ఇది నిబంధనలకు అనుగుణంగా లేకపోవచ్చు.  కానీ తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాన్ని చూపెట్టే మన ప్రజల చాతుర్యాన్ని మెచ్చుకోకుండా నేను ఉండలేను’’.. అంటూ ట్విటర్‌ వేదికగా పెద్దగా చదువుకోని ఆ ‘ఇంజినీర్‌’పై ప్రశంసలు గుప్పించాడు. 


హిస్టోరికానో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రకారం.. ఆ ఆవిష్కరణ చేసిన వ్యక్తి పేరు దత్తాత్రేయ లొహార్‌. ఊరు  మహారాష్ట్రలోని దేవ్‌రాష్‌ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు.  పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! మరి ఆనంద్‌ మహీంద్రా ఇచ్చిన ఆఫర్‌ను దత్తూ స్వీకరిస్తాడా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

చదవండి: బాధ్యత కలిగిన పౌరులను చూశా!

మరిన్ని వార్తలు