సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బిజినెస్‌మేన్‌ని గుర్తుపట్టారా?

13 Nov, 2021 16:56 IST|Sakshi

ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి యాక్టర్‌ కావాలని బిజినెస్‌మేన్ అయ్యారు. టీనేజీలో ఉన్నప్పుడు బాలీవుడ్‌ సినిమాలంటే చెవి కోసుకునేవారు. నచ్చిన సినిమాలో సీన్లను తలపించేలా రియల్‌ లైఫ్‌లో ఎడ్వెంచర్లు చేశారు. అక్కడితో ఆగిపోలేదు. సినిమా కెరీర్‌ లక్ష్యంగా హర్వర్డ్‌ యూనివర్సిటీలో జాయిన్‌ అయ్యారు. అక్కడే బిల్‌గేట్స్‌తో చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరిగారు. ఇంకేముంది యాక్టర్‌ కావాల్సిన వ్యక్తి మళ్లీ బిజినెస్‌ రూట్‌లోకి వచ్చారు. వ్యాపారంలో అనేక రికార్డులు సృష్టించారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా తాజాగా ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను షేర్‌ చేశారు. జీన్స్‌ టీషర్ట్‌లో ఉన్న ఆ వ్యక్తి ట్రక్‌లో కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతనెవరా ? అని మనం ఆలోచించేలోగా.. ఆయనే అన్ని వివరాలు చెప్పారు. 1972లో ఆనంద్‌ మహీంద్రా 17 ఏళ్ల టీనేజీ కుర్రాడిగా ఉన్నప్పుడు అప్పుడే బాలీవుడ్‌లో దుమ్మరేపిన పరిచయ్‌ సినిమా చూశారు. అంతే ఆ సినిమాలో ముసాఫిర్‌ హుం యారో అని పాట పాడుతూ తన స్నేహితుడితో కలిసి బాంబే నుంచి పూనాకి ట్రక​‍్కులో ప్రయాణం చేశారు. ఆ సందర్భంగా తీసుకున్న తన ఫోటోను ఆనంద్‌మహీంద్రా ట్వీట్టర్‌లో పంచుకున్నారు.

మరిన్ని వార్తలు