మీరు బాగుండాలయ్యా.. ఆనంద్‌ మహీంద్రా నిర్ణయానికి నెటిజన్లు ఫిదా

20 Nov, 2021 19:07 IST|Sakshi

Anand Mahindra Neo Bolt : మాటలు చెప్పడమే కాదు చేతల్లో కూడా చేసి చూపించడంలో ముందుంటారు ఆనంద్‌ మహీంద్రా. అస్సాంకి చెందిన ఓ బాలుడు ఇంటి దగ్గర వస్తువులతో ఐరన్‌ మ్యాన్‌ సూట్‌ తయారు చేస్తే.. అతన్ని చేరదీశాడు. హైదరాబాద్‌లోని ఆనంద్‌ మహీంద్రా యూనివర్సిటీలో చేర్చి ఉన్నత విద్య అందిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులకు అండగా ఉంటూ వేలాది మంది దివ్యాంగులకు ఆసరాగా నిలబడేందుకు రెడీ అవుతున్నారు. 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమకాలిన అంశాలపై రెగ్యులర్‌గా స్పందించే ఆనంద్‌ మహీంద్రా మరో మంచి కార్యక్రమానికి నాంది పలికారు. దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న యంత్రాన్ని తయారు చేసిన ఇంజనీరింగ్‌ విద్యార్థులను అభినందించారు. అంతేకాదు వారు నెలకొల్పిన స్టార్టప్‌కు ఆర్థికంగా అండదండలు అందిస్తానంటూ స్వయంగా ముందుకు వచ్చారు. 

అనుకోకుండా
వీల్‌ చైయిర్‌లో ప్రయాణిస్తున్న దివ్యాంగుడికి సంబంధించిన వీడియో ఆనంద్‌ మహీంద్రాకి కనిపించింది. వెంటనే ఆ వీడియోని ట్విట​‍్టర్‌లో షేర్‌ చేస్తూ.. ఈ వీడియోలో ఉన్నది ఎవరో,  అదెక్కడో తెలియదు కానీ, అందులో ఉన్న యంత్రం దివ్యాంగులకు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్లకు నేను సహాయం చేస్తానంటూ పేర్కొన్నారు. 

సోషల్‌ మీడియా ద్వారానే
రీట్వీట్లు, షేరింగుల ద్వారా ఆనంద్‌ మహీంద్రా ఇ‍చ్చిన హామీ చెన్నైలో ఉన్న ఐఐటీ మద్రాసు విద్యార్థులకు చేరింది. ఎందుకంటే ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేసిన వీడియో కనిపించే మెషిన్‌ రూపొందించింది వారే కాబట్టి. దివ్యాంగులు ప్రయాణించేందుకు వీలుగా అతి తక్కువ ఖర్చుతో నియో ఫ్లై, నియో బోల్డ్‌ అనే రెండు మెషిన్లు వారు రూపొందించారు. వీటి సాయంతో దివ్యాంగులు సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. మొత్తంగా సోషల్‌ మీడియా ఎఫెక్ట్‌తో చెన్నై స్టూడెంట్లతో ముంబైలో ఆనంద్‌ మహీంద్రాల మధ్య కాంటాక్టు ఏర్పడింది. చెన్నై నుంచి ముంబై చేరుకుని వారు ప్రత్యేక డెమో ఇచ్చారు.

నియో మోషన్‌
ఐఐటీ మద్రాసు విద్యార్థులు తాము రూపొందించిన మెషిన్లతో నియో మోషన్‌ అనే స్టార్టప్‌ను స్థాపించారు. దీని ద్వారా దివ్యాంగులకు అతి తక్కువ ధరకే నియో ఫ్లై, నియో బోల్ట్‌ మెషిన్లు అమ్ముతున్నారు. నియో బోల్ట్‌లో లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీలను ఉపయోగించారు. సమతలంగా ఉన్న రోడ్డుతో పాటు ఎగుడుదిగుడు రోడ్లలోనూ ఈ నియోబోల్ట్‌ ప్రయాణిస్తుంది. వీటికి షాక్‌అబ్‌జర్వర్లు ఉండటం వల్ల ప్రయాణంలో ఇబ్బందులు తగ్గుతాయి. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 30 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయవచ్చు. గరిష్ట వేగం గంటకి 25 కిలోమీటర్లుగా ఉంది. 

ప్రతీ ఏటా మూడు లక్షలు
మన దేశంలో ప్రతీ ఏడు దివ్యాంగులు ఉపయోగించుకునే మెషిన్లు 3 లక్షల వరకు అమ్ముడవుతున్నాయి. ఇందులో 2.5 లక్షల మెషిన్లు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నా​యి. ఒక్కో మెషిన్‌ ధర నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యన ఉంటోంది. కానీ ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు అందిస్తోన్న నియో బోల్ట్‌ రూ.94,900లకే ప్రస్తుతం అందిస్తున్నారు. 

వారి జీవితాల్లో కదలిక
ఆనంద్‌ మహీంద్రా లాంటి బిజినెస్‌ మ్యాగ్నెట్‌ తన వంతు బాధ్యతగా ఈ స్టార్టప్‌కు సహకారం అందిస్తానంటూ ప్రకటించారు. మహీంద్రా గ్రూపు నుంచి సహాయం అందింతే నియోబోల్ట్‌ ధర మరింతగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రయాణ సాధానాలు లేక ఇబ్బంది పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దివ్యాంగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తనంతట తానుగా ఆర్థికంగా అండగా ఉంటానంటూ ప్రకటించిన ఆనంద్‌ మహీంద్రాను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీ నిర్ణయం గ్రేట్‌ సార్‌.. మీరు బాగుండాలి సార్‌ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

చదవండి: ఐరన్‌ మ్యాన్‌ కలను నిజం చేసిన ఆనంద్‌ మహీంద్రా

మరిన్ని వార్తలు