సైరస్ మిస్త్రీ హఠాన్మరణం: ఆనంద్‌ మహీంద్ర భావోద్వేగం

5 Sep, 2022 14:42 IST|Sakshi

సాక్షి,ముంబై:  టాటాసన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్ మిస్త్రీ అకాలమరణం కార్పొరేట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.  ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన తీరుతో మితిమీరినవేగం, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకవడం తదితర అంశాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసాయి. ముఖ్యంగా  పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. ‘కారు వెనుక సీటులో కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడూ నా సీటు బెల్ట్ ధరించాలని నిర్ణయించుకుంటున్నాను.  మీ అందరూ  కూడా ఇలాంటి  ప్రతిజ్ఞ తీసుకోండి’ అంటూ ట్వీట్‌ చేశారు.

సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్లనే సైరస్‌ చనిపోయారన్న వార్తలపై పలు వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్ర మనసులోని బాధను, ఆవేదనను ట్విటర్‌లో  తన ఫాలోవర్స్‌తో  పంచుకున్నారు. దయచేసి అందరూ సీట్‌ బెల్ట్‌లు ధరించండి. వెనక సీట్లో కూర్చున్నా కూడా బకిల్‌ పెట్టుకోవడం మర్చిపోవద్దు. మన వెనుక మన కుంటుంబాలు ఉన్నాయన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.  కచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తాను  అందరూ కూడా ప్రతిజ్ఞను కూడా తీసుకోవాలంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా  కోరారు.

కాగా సైరస్ మిస్త్రీ (54) గుజరాత్‌లోని ఉద్వాడనుంచి ముంబై వెళ్తుండగా ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టాటా గ్రూప్‌ మాజీ ఇండిపెండెంట్ డైరెక్టర్ డారియస్ పండోల్, అతని భార్య ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ అనహిత పండోల్, సోదరుడు జహంగీర్ పండోల్‌తో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. అనహిత పండోలే మెర్సిడెస్ కారు నడుపుతున్న క్రమంలో అతి వేగంతో మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో ఆమె కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.  అయితే వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలోసైరస్, జహంగీర్‌ అక్కడికక్కడే చనిపోగా,  అనహిత పండోలె, డారియస్ పండోలే తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు