Anand Mahindra Responds To Elon Musk: ఎలన్‌ మస్క్‌ వాదనతో ఏకీభవించిన ఆనంద్‌ మహీంద్రా..!

8 Sep, 2021 18:41 IST|Sakshi

 భారత పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌ మస్క్‌ వాదనను అంగీకరించారు. తాజాగా ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ వేదికగా  కార్లను ఉత్పత్తి చేయడం కష్టంతో కూడుకున్న పని అని స్పష్టంచేశారు. అంతేకాకుండా లాభాలతో కంపెనీలను నడపడం మరింత కష్టమని తెలపగా.. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ  మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆటోమొబైల్‌ రంగంలో గత నలభై సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నామని, చివరకి అదే తమ జీవన శైలిని పూర్తిగా మార్చేసిందని ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు. 

చదవండి: భారత్‌లో సొంత షోరూమ్స్‌.. ఆన్‌లైన్‌ ద్వారా ఆ ఫీట్‌ సొంతం అయ్యేనా?

ప్రముఖ బ్రిటిష్‌ శాస్త్రవేత్త, బిలియనీర్‌ జేమ్స్‌ డైసన్‌ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం కొద్ది రోజుల క్రితమే విడుదలైంది.  జేమ్స్‌ డైసన్‌ ఎలక్ట్రిక్‌ కార్లను ఉత్పత్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం భారీగా మొత్తంలో ఖర్చు చేశారు. తాజాగా జేమ్స్‌ డైసన్‌కు సంబంధించిన విషయాలను ఆంటోనీ అనే ఓ ఇంజనీర్‌ ట్విటర్‌లో ప్రస్తావించాడు. ఈ ట్విట్‌కు స్పందిస్తూ ఎలన్‌ మస్క్‌.. ఎలక్ట్రిక్‌ కార్లను ఉత్పత్తి చేయడం కష్టంతో కూడుకున్న పని అని ట్విటర్‌లో వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని కంపెనీలు తక్కువ లాభాలకే వాహనాలను విక్రయిస్తున్నాయిని పేర్కొన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో ఆయా కంపెనీలు ఎక్కువగా వాహనాల విడిభాగాల అమ్మకాల ద్వారానే  లాభాలను గడిస్తున్నాయని తెలిపారు.

గత ఏడాదితో పోలిస్తే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆగస్టులో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాదిలో  కంపెనీ సుమారు  13,651 యూనిట్లను విక్రయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా ఎలన్‌మస్క్‌ ట్విట్‌పై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా ట్విట్‌పై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు. కాగా ఆనంద్‌ మహీంద్రా ట్విట్‌కు ఇంకా ఎలన్‌ మస్క్‌ స్పందించాల్సి ఉంది. 
 చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..!
 

మరిన్ని వార్తలు