చిరకాల స్వప్నం నెరవేర్చావు, కేటీఆర్‌.. థ్యాంక్‌ యూ : ఆనంద్‌ మహీంద్రా

17 Jan, 2022 17:20 IST|Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఆనంద్‌ మహీంద్రా తెలంగాణ ప్రభుత్వానికి.. ప్రత్యేకించి మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకో తెలుసా?.. తన చిరకాల స్వప్నం నెరవేర్చినందుకు!


అవును.. ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ’ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ రేసు కోసం హైదరాబాద్‌ నగరం వేదికగా ఇవాళ ఖరారైంది. ఈ తరుణంలో సొంత రేసింగ్‌ కార్లను(మహీంద్రా రేసింగ్‌ కంపెనీ) స్వదేశంలో పరుగులు పెట్టించబోతున్నందుకు కృతజ్ఞతగా ఆనంద్‌ మహీంద్రా కేటీఆర్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ఒక ట్వీట్‌ చేశారు. సొంత గడ్డపై తమ రేసింగ్‌ కార్లను ఉరుకులు పెట్టబోతున్నాయి.. చిరకాల కల నెరవేరబోతోంది. ఈ కలను నెరవర్చేదిశగా అడుగు వేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా.     

ఫార్ములా E సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో- మంత్రి కేటీఆర్‌ సంయుక్తంగా ABB FIA ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణ గురించి సోమవారం ప్రకటించారు. పనిలో పనిగా మహీంద్రా రేసింగ్ మొదటి నుంచి అందిస్తున్న మద్దతును సైతం అల్బెర్టో లాంగో ప్రస్తావించారు. ఇదిలా ఉంటే ఫార్ములా వన్‌ తరహాలో ఇ-వన్‌ ఛాంపియ్‌షిప్‌ కూడా గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నదే. ఈ రేసింగ్‌ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ప్రత్యేక రేసింగ్‌ ట్రాక్‌ అక్కర్లేని ఈ ‘ఇ వన్‌​ ఫార్ములా’ ఛాంపియన్‌షిప్‌ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వ్యవస్థాపక బృందంలో మహీంద్రా రేసింగ్‌ కంపెనీ కూడా భాగస్వామిగా ఉంది.  

ఇప్పటి వరకు లండన్‌, న్యూయార్క్‌, మెక్సికో, రోమ్‌, బెర్లిన్‌, రోమ్‌, సియోల్‌, వాంకోవర్‌ నగరాల్లో ఈ పోటీలు జరిగాయి. తాజాగా తొమ్మిదో సీజన్‌కి సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలిచింది. ఆ తర్వాత నిర్వహించబోయే ఛాంపియన్‌షిప్‌కి హైదరాబాద్‌ నగరం ఆతిధ్యం ఇ‍చ్చేందుకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్త: ఫార్ములా ఇ- వన్‌ ఛాంపియన్‌షిప్‌.. ఇట్‌ హ్యాపెన్స్‌

మరిన్ని వార్తలు