ఎలన్‌మస్క్‌ నంబర్‌ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్‌ మహీంద్రా

19 Oct, 2021 10:58 IST|Sakshi

ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలన్‌మస్క్‌ను ఫోర్బ్స్‌ గుర్తించింది. కేవలం యాభై ఏళ్ల వయసులోనే ఎంతోమంది సీనియర్‌ వ్యాపారవేత్తలను వెనక్కి నెట్టి ఎలన్‌మస్క్‌ ఈ స్థానం దక్కించుకున్నారు. దీంతో ఎలన్‌మస్క్‌ చిన్న వయసులోనే ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందుకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

మహీంద్రా ఇలా చెప్పారు
ఎలన్‌మస్క్‌ విజయ రహస్యం ఏంటనే అంశంపై ఇండియన్‌ ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రా సరికొత్తగా స్పందిస్తూ.. ఈ రోజు మార్కెట్‌ క్యాపిటల్‌ అనేక రెట్లు పెరగడం వల్ల ఎలన్‌ మస్క్‌ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ధనవంతుడు కాలేదు. ఆశయం, ధైర్యం, తెగింపు వంటి లక్షణాలు అనేక రెట్లు ఆయనలో ఉన్నాయి. అలా ఉన్న వారి సంపాదన భవిష్యత్తులో మిగిలినవారి కంటే ఎక్కువగా ఉంటుంది అనే అర్థం వచ్చేలా ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

వాళ్లిద్దరు కలిసినా
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ట్యాగ్‌లైన్‌ ఎలన్‌మస్క్‌, జెఫ్‌ బేజోస్‌ల మధ్య కొంత కాలంగా దోబూచులాడుతోంది. అయితే ఇటీవల ఎలన్‌మస్క్‌కి సంబంధించిన టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల షేర్ల ధరలు పెరిగాయి. దీంతో వాటి మార్కెట్‌ క్యాపిటల్‌లో కొత్తగా 70 బిలియన్‌ డాలర్ల సంపద వచ్చి చేరింది. దీంతో ఆ రెండు సంస్థలకు ఓనరైన ఎలన్‌ మస్క్‌ ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా మారారు. సుదీర్ఘకాలం ఈ స్థానంలో కొనసాగిన మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌, వాల్‌మార్ట్‌ వ్యవస్థాపకుడు వారన్‌ బఫేట్‌ల ఇద్దరి సంపాదన కలిపినా సమం కాని స్థితికి ఎలన్‌మస్క్‌ చేరుకున్నాడు. 

చదవండి:ఆనంద్‌ మహీంద్రా చెప్పిన బిజినెస్‌ పాఠం! 

మరిన్ని వార్తలు