Anand Mahindra: తాలిబన్ల ఇలాకాలో ఆ ఛాన్స్‌ వస్తేనా..

28 Sep, 2021 13:14 IST|Sakshi

కఠిన ఆంక్షలు, నిషేధాజ‍్క్షలతో ఒకప్పుడు తాలిబన్లు అఫ్గన్‌లకు ప్రత్యక్ష నరకం చూపించారు. మళ్లీ వాళ్ల పాలనలో భయంభయంగానే గడపాల్సి వస్తోంది అక్కడి ప్రజలు. పైకి అంతర్జాతీయ సమాజానికి మాత్రం ఒకలా సందేశం ఇస్తూ.. అంతర్గతంగా అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు తాలిబన్లు ఇప్పుడు. మాట కాదన్నా.. ఎదురు తిరిగినా ఉరి తీసి వేలాడేస్తున్నారు. 


తాజాగా మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరమంటూ ఫత్వా జారీ చేసిన తాలిబన్లు, బార్బర్‌లు, సెలూన్‌ నిర్వాహకుల జీవనోపాధిపై పెద్దదెబ్బే వేశారు. ఈ నేపథ్యంలో కొందరు దుకాణాలు మూసేసుకుంటుండగా.. తెగిస్తున్న కొందరికి చావు బెదిరింపులు అందుతున్నాయట. అయితే సమకాలీన అంశాలపై నిత్యం స్పందించే మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా.. ఈ సీరియస్‌ పరిణామంపై తనదైన శైలిలో ఓ ట్విటర్‌ పోల్‌ నిర్వహించారు.

ఒకవేళ మీరు గనుక అఫ్గనిస్తాన్‌లో ఓ షేవింగ్‌ రేజర్‌ కంపెనీ సేల్స్‌ పర్సన్‌ అయ్యి ఉంటే.. ప్రస్తుత పరిణామాలలో ఏం చేస్తారు? అంటూ నాలుగు ఆఫ్షన్‌లు ఇచ్చారాయన. ఒకటి.. బ్యాగ్‌ ప్యాక్‌ చేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు తిరుగు టపా కట్టడం, రెండు.. ఆ ఆదేశాల్ని మార్చేలా లాబీయింగ్‌ చేయడం, మూడు.. గడ్డం సంరక్షణ కోసం కొత్త ప్రొడక్ట్‌ను కనుగొనడం, నాలుగు.. మీ ముందు ఇంకేమైనా మార్గం ఉందా? అని అడిగారు. అఫ్‌కోర్స్‌.. దానికి నెటిజన్స్‌ కూడా అంతే ఫన్నీగా రిప్లైలు ఇస్తున్నారనుకోండి.

ఇదిలా ఉంటే అఫ్గన్‌ హెల్మండ్‌ ప్రావిన్స్‌లో మగవాళ్లు స్టైల్‌గా క్రాఫ్‌ చేయించుకోవడం, గడ్డం తీసేయడాన్ని నిషేధిస్తూ ఫత్వా జారీ చేసింది తాలిబన్‌ సంస్థ.  అంతేకాదు ఇస్లామిక్‌ ఓరియెంటేషన్‌ మంత్రిత్వ శాఖ సెలూన్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి.. కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు ఆ ఆదేశాల్ని ఎదురు ప్రశ్నించడానికి వీల్లేదని కూడా పేర్కొంది. ఇక ఆ ఆదేశాల్లో సెలూన్లలో పాటల్ని ప్లే చేయకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: మరో బాంబు పేల్చిన తాలిబన్లు

మరిన్ని వార్తలు