Vikram Agnihotri: ‘విక్రమ్‌కి చేతుల్లేవ్‌.. కానీ అతనే మా కారును నడిపిస్తే సంతోషిస్తా!’

21 May, 2022 11:48 IST|Sakshi

స్ఫూర్తిగొలిపే వ్యక్తులను మెచ్చుకోవడంతో పాటు వారిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆనంద్‌ మహీంద్రా ఎప్పుడు ముందుటారు. అంతేకాదు ప్రతిభకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు క్షణకాలం కూడా వెనుకాడరు. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది కూడా. తాజాగా మరోసారి తనదైన శైలిలో ఓ అసాధారణ ప్రతిభవంతుడికి అరుదైన ఆఫర్‌ ఇచ్చారు ఆనంద్‌ మహీంద్రా. 

విక్రమ్‌ అగ్నిహోత్రి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన విక్రమ్‌ అగ్నిహోత్రికి చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదంలో రెండు చేతులు పోయాయి. ఐనప్పటికీ పట్టుదలతో చేతులు లేని లోటును కాళ్లతో భర్తీ చేశాడు. కాళ్లతోనే రాయడం నేర్చుకుని మాస్టర్స్‌ డిగ్రీ పొందాడు. కంప్యూటర్‌ ఆపరేట్‌ చేయడలడు. నీటిలో ఈదగలడు. ఇదే క్రమంలో ఎంతో కష్టపడి కారు డ్రైవింగ్‌ కూడా నేర్చుకున్నాడు. చేతుల్లేకపోయినా కాళ్లతోనే కారును నేర్పుగా నడిపే ఒడుపును ఒంటబట్టిచ్చుకున్నాడు. 

చట్టాలను మార్చాడు
తాను ఎందులో ఎవరికీ తక్కువ కాదంటూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు విక్రమ్‌ అగ్నిహోత్రి. అయితే అతనికి లైసెన్స్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. కోర్టుల్లో న్యాయ పోరాటం చేసిన తర్వాత చివరకు చట్టాల్లో మార్పులు చేసి లైసెన్సు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం దివ్యాంగుల కోసం అతనో ఎన్జీవోను నిర్వహిస్తున్నాడు. విక్రమ్‌ అగ్నిహోత్రికి పట్టుదల అతని ప్రత్యేక ప్రతిభలను వివరిస్తూ ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి.

మాకు గర్వకారణం
విక్రమ్‌ అగ్నిహోత్రి విజయగాథ తనకెంతో స్పూర్తిని కలిగించందంటూ ఆనంద్‌ మహీంద్రా స్పందించాడు. అతనికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. మా అందరిలో స్ఫూర్తి నింపుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు మహీంద్రా పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తి మా కారును డ్రైవ్‌ చేయడం మాకు గర్వకారణం అంటూ ‘ఆఫర్‌’ ఇచ్చారు ఆనంద్‌ మహీంద్రా. 

వాట్‌ నెక్ట్స్‌
మహీంద్రా మాటలను బట్టి త్వరలోనే వివేక్‌ అగ్నిహోత్రికి ఏదైనా మహీంద్రా బ్రాండ్‌ కొత్త కారుని బహుమతిగా ఇస్తారని నెటిజన్లు అంటున్నారు. గతంలో ఆయన ఈ విధంగా చాలా మందికి కార్లను బహుమతిగా అందించారు. కాగా విక్రమ్‌కి ఉద్యోగ అవకాశం కల్పించాలని మరికొందరు కోరుతున్నారు.

చదవండి: నా భార్య కోసం ఆర్డర్‌ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్‌ మహీంద్రా

మరిన్ని వార్తలు