చార్‌ధామ్‌కు అనంత్ అంబానీ భారీ విరాళం

8 Oct, 2020 13:45 IST|Sakshi

చార్‌ధామ్‌కు 5 కోట్ల  రూపాయల  విరాళం

డెహ్రాడూన్‌: ఆసియా అపర కుబేరుడు, పారిశ్రామిక దిగ్గజం, ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దాతృత్వాన్ని చాటుకున్నారు. రిలయన్స్ అధినేత కుమారుడు, జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు అదనపు డైరెక్టర్ అనంత్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డుకు రూ .5 కోట్లు విరాళంగా ఇచ్చారు. గత సంవత్సరం కూడా రిలయన్స్ కుటుంబం రూ .2 కోట్లు విరాళంగా ఇచ్చింది. 

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నచార్‌ధామ్‌ దేవస్థానానికి అంబానీ కుటుంబం ఈ భారీ విరాళాన్ని అందించింది. ఉద్యోగుల జీతాలు చెల్లించడం, మౌలిక సదుపాయాలు పెంపు, యాత్రికులకు సౌకర్యాలు కోసం దీన్ని వినియోగించనున్నారు. కరోనా మహమ్మారి పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రధానంగా లాక్‌డౌన్ ప్రభావంతో  రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమకు సాయపడాలని దేవస్థాన బోర్డు అదనపు సీఈవో బీడీ సింగ్‌ అంబానీ కుటుంబానికి  విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనంత్‌ అంబానీ ఈ విరాళం ప్రకటించారు. ఈ మహమ్మారి కారణంగా సిబ్బందికి  జీతాలు చెల్లించలేకపోతున్నామని సింగ్‌ పేర్కొన్నారు.  బోర్డు సీఈఓ రవీనాథ్ రామన్  కృతజ్ఞతలు తెలిపారు.

కాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం విన్నపం మేరకు 2019 మార్చిలో అనంత్ శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీలో భాగమయ్యారు. చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి నాలుగు పుణ్యక్షేత్రాలతోపాటు, ఇతర 51 దేవాలయాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే కమిటీలో చేరకముందే, అంబానీ 2018లో ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించారు.అలాగే కుమార్తె ఇషా అంబానీ వెడ్డింగ్ కార్డును ఇక్కడ అందించారు. ఆ సమయంలో రూ .51 లక్షల రూపాయలను ఆలయం నిధులకు అందించినట్లు సమాచారం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు