బెంగళూరు కంటే హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌

21 May, 2022 10:51 IST|Sakshi

కో–వర్కింగ్‌లో జోష్‌ 

ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో 13 శాతం వాటా 

ఐటీ, ఈ–కామర్స్‌ స్థలాలకు తగ్గిన గిరాకీ  

సాక్షి, హైదరాబాద్‌: ఊహించినట్లుగానే కరోనా తర్వాత కో–వర్కింగ్‌ స్పేస్‌ శరవేగంగా కోలుకుంది. బహుళ జాతి కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ను కొనసాగిస్తుండటం, మధ్య స్థాయి కంపెనీలు హైబ్రిడ్‌ విధానంలో పని చేస్తుండటంతో కో–వర్కింగ్‌ విభాగానికి డిమాండ్‌ ఏర్పడింది. 2021–22 ఆర్థ్ధిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3.41 కోట్ల చ.అ. నికర ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరగగా.. ఇందులో 13 శాతం వాటా (44.3 లక్షల చ.అ.) కో–వర్కింగ్‌ స్పేస్‌ విభాగానిదే.     2020–21 ఆర్థిక సంవత్సరంలో టాప్‌–7 నగరాల్లో 2.13 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరగగా.. ఇందులో కో–వర్కింగ్‌ స్పేస్‌ 5 శాతం వాటాను కలిగి ఉందని అనరాక్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 8 శాతం వృద్ధి రేటు నమోదయింది. అన్ని కార్యాలయాల విభాగాలలో ఇదే అత్యధిక వృద్ధి రేటు కావటం గమనార్హం. 

క్షీణించిన ఐటీ, ఈ–కామర్స్‌.. 
ఆశ్చర్యకరంగా 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, ఐటీఈఎస్, ఈ–కామర్స్‌ రంగాల ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు క్షీణించాయి. 2021 ఆర్ధికంతో పోలిస్తే తయారీ, పారిశ్రామిక రంగాలు అత్యధికంగా ఏటా 4 శాతం నికర లావాదేవీల వృద్ధిని నమోదు చేయగా.. ఐటీ, ఈ–కామర్స్‌ రంగాలు మాత్రం వరుసగా 8 శాతం, 6 శాతం మేర క్షీణించాయి. 

పెద్ద స్థలాలకే గిరాకీ.. 
2022 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో నికర ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలలో బెంగళూరును హైదరాబాద్‌ అధిగమించింది. లక్ష చ.అ. కంటే ఎక్కువ స్పేస్‌ లావాదేవీలు 2021 ఆర్ధిక సంవత్సరంలో 47 శాతం వాటా కలిగి ఉండగా.. 2022 ఆర్థికం నాటికి 50 శాతానికి పెరిగాయి. అలాగే మధ్య స్థాయి ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు స్వల్పంగా 1 శాతం మేర వృద్ధి చెందగా.. చిన్న స్థాయి ఒప్పందాలు మాత్రం ఏకంగా 4 శాతం క్షీణించాయి. 

కొత్త సప్లయ్‌లో దక్షిణాది టాప్‌.. 
2022 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 5.12 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ సరఫరా జరిగింది. ఇందులో 58 శాతం అంటే 2.98 కోట్ల చ.అ. వాటా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై దక్షిణాది నగరాలే కలిగి ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం వృద్ధి. సగటున టాప్‌ 7 నగరాలలో కార్యాలయాల అద్దెలు చ.అ.కు రూ.76గా ఉంది. అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్‌గా ముంబై నిలిచింది. ఇక్కడ చ.అ. ధర రూ.126గా ఉంది. ఆ తర్వాత బెంగళూరు, ఎన్‌సీఆర్‌ నగరాలలో చ.అ.కు రూ.78గా ఉంది. కొత్తగా ఆఫీస్‌ స్పేస్‌ నిర్మాణాలు పూర్తి కావటంతో టాప్‌ 7 నగరాల్లో ఖాళీ స్థాయిలు 1 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా 28.5 శాతంతో అత్యధిక ఆఫీస్‌ స్పేస్‌ వేకెన్సీ ఉన్న నగరంగా ఎన్‌సీఆర్‌ నిలిచింది. ఆ తర్వాత 23.5 శాతంతో కోల్‌కతా, 15.75 శాతం వేకెన్సీతో ముంబై నిలిచాయి. 

బెంగళూరును మించి 
హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ కొత్త రికార్డ్‌లను సృష్టిస్తోంది. బెంగళూరులో కంటే మన నగరంలోనే అత్యధికంగా కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరిగాయి. 2022 ఆర్ధిక సంవత్సరంలో గార్డెన్‌ సిటీలో 76 లక్షల చ.అ. నికర ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరగగా.. హైదరాబాద్‌లో 78.5 లక్షల చ.అ. ట్రాన్సాక్షన్స్‌ పూర్తయ్యాయి. 2022 ఫైనాన్షియల్‌ ఇయర్‌లోని మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలలో హైదరాబాద్‌ వాటా 23 శాతంగా ఉంది. అయితే కొత్త సపయ్‌లో మాత్రం బెంగళూరు ముందుంది. ఇక్కడ కొత్తగా 1.45 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ సరఫరా కాగా.. మన నగరంలో 1.18 కోట్ల చ.అ.లకు పరిమితమైంది. 

డిమాండ్‌ ఎందుకంటే? – అనూజ్‌ పూరీ, చైర్మన్, అనరాక్‌ గ్రూప్‌  
కరోనా సమయంలో దేశీయ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌లో హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ బలమైన కొత్త శక్తిగా ఆవిర్భవించింది. వ్యాపారులు, ఉద్యోగులకు కార్యకలాపాలను సజావుగా కొనసాగించే సౌకర్యవంతమైన ప్రదేశాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆఫీస్‌ లేఅవుట్‌ను మార్చే ఇతర ఎంపికలు లేదా హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌తో పోలిస్తే హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ను స్వీకరించడానికి కో–వర్కింగ్‌ స్పేస్‌ అత్యంత ప్రాధాన్య ఎంపికగా మారిపోయాయి. 

చదవండి: రియల్టీ అంటే ఇళ్లు ఒక్కటే కాదు.. ఇవి కూడా

మరిన్ని వార్తలు