5 శాతం పెరిగిన రేట్లు.. హైదరాబాద్‌లో తగ్గని రియల్టీ జోరు

7 May, 2022 11:32 IST|Sakshi

నగరంలో చ.అ. ధర రూ.4,450 

క్యూ1లో 13,140 గృహాల అమ్మకం 

21,500 యూనిట్ల లాంచింగ్స్‌ 

అనరాక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా తర్వాతి నుంచి హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌కు బ్రేక్‌లు పడట్లేదు. గృహ విక్రయాలు, లాంచింగ్స్‌లో మూడంకెల స్థాయిలో వృద్ధి రేటు నమోదవుతుంది. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 నాటికి నగరంలో ఇళ్ల అమ్మకాలలో మూడు రెట్లు పెరుగుదల కనిపించింది. అయినా దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నేటికీ ధరలు అందుబాటులోనే ఉన్నాయి.

5 శాతం పెరుగుదల
గత ఏడాది కాలంలో నగరంలో ప్రాపర్టీల ధరలు 5% మేర పెరిగాయి. గతేడాది తొలి  త్రైమాసికంలో చ.అ.కు రూ.4,240గా ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి రూ.4,450లకు పెరిగింది.  నగరంలోని అఫర్డబుల్‌ రేట్ల కారణంగా కొనుగోలుదారులతోపాటు పెట్టుబడిదారులు, డెవలపర్లు నగరం వైపు ఆసక్తిని చూపిస్తున్నారని అనరాక్‌ రీసెర్చ్‌ హెడ్‌ ప్రశాంత్‌ ఠాకూర్‌ తెలిపారు. కాస్మోపాలిటన్‌ వాతావరణం. మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యత వంటి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయని వివరించారు. హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 53 నెలలుగా ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 27 నెలలకు క్షీణించింది. 

13,400 యూనిట్ల విక్రయం.. 
గతేడాది హైదరాబాద్‌లో 25,400 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 197 శాతం ఎక్కువ. తక్కువ వడ్డీ రేట్లు, డెవలపర్లు డిస్కౌంట్లు వంటి సేల్స్‌ పెరుగుదలకు ప్రధాన కారణాలని తెలిపారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఇదే జోరు కనిపించింది. 2022 క్యూ1లో నగరంలో 13,140 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 199 శాతం వృద్ధి. దేశంలోని ఏ ఇతర నగరాల్లోనూ ఈ స్థాయి లో వృద్ధి రేటు నమోదు కాకపోవటం గమనార్హం. 

రికార్డ్‌ స్థాయిలో లాంచింగ్స్‌.. 
కొత్త గృహాల ప్రారంభాలు పరిశీలిస్తే.. రికార్డ్‌ స్థాయిలో 234 శాతం వృద్ధి రేటు నమోదయింది. లాంచింగ్స్‌లో ముంబై తర్వాత 24 శాతం వాటాతో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది క్యూ1లో నగరంలో 21,500 యూనిట్లు ప్రారంభమయ్యాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే 71 శాతం, నాల్గో త్రైమాసికంతో పోలిస్తే ఇది 41 శాతం వృద్ధి రేటు. 

50 శాతం పశ్చిమంలోనే.. 
ఎప్పటిలాగే లాంచింగ్స్‌లో పశ్చిమ హైదరాబాదే ముందు నిలిచింది. గృహాల సప్లయిలో ఈ ప్రాంతం వాటా 60 శాతంగా ఉంది. ఆ తర్వాత 32 శాతంతో నార్త్‌ హైదరాబాద్, చెరో 5 శాతం వాటాతో తూర్పు, దక్షిణ హైదరాబాద్‌ ప్రాంతాలు నిలిచాయి. 

లగ్జరీ ప్రాజెక్ట్‌లే ఎక్కువ.. 
లాంచింగ్స్‌లో రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉన్న హై ఎండ్‌ గృహాలే 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ధర ఉన్న మధ్య స్థాయి గృహాల వాటా 29 శాతం ఉన్నాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ధర ఉన్న లగ్జరీ యూనిట్ల వాటా 11 శాతం, రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల వాటా 10 శాతంగా ఉంది. రూ.40 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాల వాటా 10 శాతంగా ఉంది. 

చదవండి: రూ. 97 కోట్లు పెట్టి ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌ కొనుగోలు చేసిన బజాజ్ ఫ్యామిలీ

మరిన్ని వార్తలు